ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత
- 11 Views
- admin
- May 15, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
హైదరాబాద్: హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఈ ఉదయం నుంచి స్థానికులు, వామపక్షాల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెల కొనగా, ధర్నా చౌక్ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తూ, కొద్దిసేపటి క్రితం జనసేన కార్యకర్తలు, తమ జెండాలతో ఇందిరా పార్కు వద్దకు చేరుకున్నారు. వారంతా స్థానికులతో కలసి నినాదాలు చేస్తుండటంతో
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికులమని చెప్పుకుంటున్న వారికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, గూండాలను పంపుతున్నారని వామపక్షాలు ఆరోపిస్తుండగా, అసలు ఈ ప్రాంతంతో ఎంతమాత్రమూ సంబంధం లేని వారు వచ్చి, తమపై గూండాగిరి చేసి దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. ఇక ధర్నా చౌక్ నగరం మధ్యలో ఉంటేనే నిరసనలు తెలిపే సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని తమ నేత పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చినట్టు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు రావడం విశేషం. అసలు నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాతే ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
ఒకే సమయంలో ధర్నా చౌక్ వద్దకు చేరిన ఇరు వర్గాలు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. జండా కర్రలతో తమపై దాడులు చేశారని స్థానికులు, బయటి నుంచి గూండాలను తెప్పించి తమపై రాళ్లను రువ్వారని వామపక్షాలు పరస్పరం ఆరోపించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం, తోపులాటలతో మొదలైన గొడవ, ఆపై రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది. ఎవరినీ అరెస్టులు చేయవద్దని ముందే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగా, అక్కడ మోహరించిన పోలీసులు ఈ దాడులను చూసీ చూడనట్టు వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఇరు వర్గాలనూ వేరు చేసి బందోబస్తును పెంచామని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.


