సింహం గడ్డి మేసింది.. పోలీసు బాసూ… మీరేమంటారు..?
- 26 Views
- admin
- May 15, 2017
- Home Slider రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా: నాలుగో సింహం గడ్డి మేసింది… ఏసీబీ వలకి అడ్డంగా దొరికిపోయింది. ఇది జనానికి కొత్తేం కాదు. పోలీసుల గురించి తెలియని వాళుభారతదేశం లోనే లేరు. అవినీతికి పోలీసు వ్యవస్ధ పెట్టింది పేరు అని ప్రపంచం కోడై కూస్తోంది. ఇదే విష యాన్ని అంతర్జాతీయ స్ధాయిలో ఒక సంస్థ సర్వే చేసి నిగ్గు తేల్చింది కూడా. భారత దేశంలో అవినీతి గురించి ప్రస్తావించిన ఆ సంస్ధ.. ఈ విషయంలో నాలుగో సింహానికే ప్రధమ స్ధానం ఇచ్చింది. ఇవన్నీ ఎల్.కే.జీ విద్యార్ధి నుంచీ ప్రతీ ఒక్కరికి తెలిసిందే.
కానీ అదేం విచిత్రమో.. ఈ విషయం విజయ నగరం పోలీసు బాస్‌కు తెలియదు. ఐదు లక్షల రూపాయల లంచం అడిగి.. అందులో మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు విజయనగరం వన్ టౌన్ సీఐ శోభన్ బాబు. దరిమిలా పోలీసు సింహాల అవినీతిపై చర్చ తెరపైకి వచ్చింది. సదరు శోభన్ బాబు వ్యవహారంపై, పనితీరుపై గతంలో అనేకసార్లు ఆరోపణలు, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ విశేషం ఏంటంటే ఈ విషయం పోలీసు బాసు దాకా వెళ్లలేదట.! ఇప్పుడు సింహం అడ్డంగా దొరికి పోవడంతో జనం పోలీసు బాసు తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో క్షేత్ర స్ధాయి నుంచి జరుగుతున్న అవినీతి బాగోతం బహిరంగ రహస్యమే. దీనిని ప్రక్షాళన చేయా ల్సిన పోలీసు బాసు సమయం చిక్కినప్పుడల్లా.. వారి గురించి, వీరి గురించి ఊదరగొట్టేసేవారు. జిల్లా పోలీసు యంత్రాంగంలో ఏమీ లేదన్నట్టు, ఊరి మీద పడ్డారు. మయూరి కూడలిని దత్తత తీసుకున్నారు. పురపాలక సంఘం పట్టించుకోవ డం లేదన్న సాకుతో ఆ కూడలి పేరుని ఎస్పీ బంగళా కూడలిగా కూడా మార్చేసారు..! అక్కడి నుండి ఎస్పీ బంగళా వరకూ ఆధునీకరించారు. ఇలా పోలీసు బాసు చేపట్టిన పలు సామాజిక సేవా పనులను మెచ్చుకోకుండా ఉండలేం. ఓ ఆదర్శమూర్తి, ఓ మానవతావాది, ఓ దార్శని కుడు.. పోలీసు బాసుగా రావడం అందరినీ తెగ సంతోష పెట్టేసింది. ఐతే పోలీసు వ్యవస్ధలో ఉన్న అవినీతి భూతం గురించి ఇంతోటి పోలీసు బాసుకు తెలియక పోవడం ఏంటని జనం సన్నాయి నొక్కులు.. నొక్కిన సందర్భాలూ ఉన్నాయి.
ఎక్కడో కాదు…
జిల్లా కేంద్రంలో .. అదీ శాంతిభద్రతల నిర్వహ ణలో కీలకమైన వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ప్రధాన బాద్యతలు నిర్వహిస్తున్న సింహం గడ్డి మేసింది. రాష్ట్ర ఏసీబీ సెంట్రల్ బ్ళందం స్వయం గా రంగంలోకి దిగింది. నాలుగో సింహం ఆట కట్టించింది. సాధారణంగా లంచావతారాల పని పట్టడానికి మూడు జిల్లాలకు కలిపి ఒక డిఎస్పీ ఉంటారు. కానీ నాలుగో సింహం గురించి బాగా తెలిసిన బాధితులు ఏసీబీ రాష్ట్ర ఉన్నతాధికారు లను సంప్రదించాడంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని ఒక సీఐ అవి నీతి బాగోతం జనం అందరికీ తెలుసు.. కానీ పోలీసు బాసుకు ఎందుకు తెలియలేకపోయింది అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. రోజూ కలుస్తుంటారు..సమావేశాలు నిర్వహిస్తుంటారు.. సమీక్షలు నిర్వహిస్తుంటారు. అలాంటిది పోలీసు బాసు, నాలుగో సింహం అవినీతిని పసిగట్టలేక పోవడం.. ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. నాలుగో సింహం కంటిచూపుతోనే నేర స్ధులను ఇట్టే పసిగడుతుందని గొప్పలు చెప్పు కోవడం కద్దు. మరి పోలీసు బాసు తన కళ్ల ముందే ఉన్న.. ఈ అవినీతి సింహాన్ని ఎలా పసి గట్టలేకపోయారని జనం ముక్కున వేలేసుకొని మరీ ఆశ్చర్యపోతున్నారు. ఒక దొంగ దొరికితే.. అతని వెనుక ఉన్న అందరి గురించి ఆరా తీయడం పోలీసుల ఆనవాయితీ. ఆ వ్యవహరం లో వారి ప్రమేయం కూడా పోలీసుల అనుమా నం. మరి సీఐ అడ్డంగా దొరికిపోవడంతో, అతను ఎవరి కనుసన్నల్లో ఉన్నారో.. వారిని కూడా జనం అనుమానంగా చూడడం సహజం. ధర్నాలు జరిగితే పదిమంది నిరసనకారులను తరిమేయడానికి ఓ రెండు వందల మంది పోలీ సులు సిద్దం అవుతారు. ఓ ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసుస్టేషన్ కు వెళ్తే.. నిలువెల్లా దిక్కుమాలిన ప్రశ్నలతో తూట్లు పొడుస్తారు. ట్రాఫిక్ పేరు చెప్పి రోడ్డుపై జూలు విదిలిస్తారు. జనానికి రోడ్డుపైనే క్లాసులు పీకుతారు. మరి ఇప్పుడు ఇంత బహిరంగంగా అవినీతి సింహం దొరికి పోయింది కదా..! మరి దీనిని ఏమంటారు..?
అవినీతికి పరాకాష్ట..
పోలీసు వ్యవస్ధ ఎంత దారుణంగా గాడి తప్పింది అనడానికి సీఐ శోభన్ బాబు అవినీతి బాగోతమే ప్రధాన సాక్ష్యం. ఎందుకంటే.. సదరు సీఐ లం చం తీసుకున్నది.. తన కింద పనిచేసే హోం గార్డు నుంచి సీఐపై రాష్ట్ర ఏసీబీ ఉన్నతాధి కారులను సంప్రందించింది కూడా అదే పోలీసు వ్యవస్ధలోని మనిషే .. ఈ నెల 5న విజయన గరం పట్టణం పరిధిలో కిడ్నాప్ కధ వెలుగులోకి వచ్చింది. ఓ రియల్ వ్యాపారి.. కిడ్నాప్ వ్యవహా రంలో పోలీసులే కీలక పాత్రధారులయ్యారు. ఈ కేసు వ్యవహారంలోనే సాక్ష్యాత్తు తన దగ్గర పనిచేసే హోంగార్డు నుండే లంచం తీసుకొని మరీ దొరికిపోయారు సదరు సీఐ. ఈ సందర్భం గా బాధిత హోంగార్డు చెప్పిన వాస్తవాలు జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి జాడ్యాన్ని చూపించినట్టయ్యింది. జిల్లా కేంద్రమైన విజయ నగరం పట్టణంలోనే ఇంత దారుణం జరుగు తుంటే.. దీని గురించి పోలీసు నిఘా వర్గాలకు ఏమీ తెలియకపోవడం.. బిలియన్ డాలర్ల ప్రశ్న. పోలీసు బాసుకు కూడా ఏమీ తెలియకపోవడం ఓ బేతాళ ప్రశ్న.