
న్యూయార్క్: వన్నాక్రై తరహాలోనే కంప్యూటర్లను అతలాకుతలం చేయగలిగే మరో వైరస్ తెరమీదకు వచ్చింది. ఇది వన్నాక్రై కన్నా మరింత శక్తిమంతమైంది కావడం గమనార్హం. ఎటర్నల్ రాక్స్ అనే ఈ వైరస్‌ను ఎదుర్కోవడం వన్నాక్రై కన్నా జటిలంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. వన్నాక్రై ర్యాన్సమ్వేర్లో అంతర్నిర్మితంగా కిల్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఎటర్నల్రాక్స్లో అలాంటిదేమీ ఉండదు. అదే పెద్దసమస్య అని భావిస్తున్నారు. ఈ వైరస్‌లో నిజానికి కంప్యూటర్ను లాక్ చేసే లేదా ఫైళ్లను కరప్ట్ చేసే అంశాలేవీ లేవు. కానీ ఒకసారి ఇది దాడిచేస్తే రిమోట్ పద్ధతిలో కంప్యూటర్ను పీడించే అవకాశం ఏర్పడుతుంది. కంప్యూటర్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ను యాక్టివేట్ చేయవచ్చు. పైగా గుర్తింపు ప్రయత్నాలను 24 గంటలు ఆలస్యం చేసే ఎత్తుగడలు ఈ కొత్త వైరస్‌కు ఉండటం విశేషం. ఈ వైరస్ ఇంకా ప్రమాదకర స్థాయిలో వ్యాపించనప్పటికీ రాబోయే వైరస్ ముప్పులు ఏరకంగా ఉంటాయో ఇది సూచిస్తున్నదని ఫార్చ్యూన్ పత్రిక రాసింది. ఇటీవల వన్నాక్రై వైరస్ 150 దేశాల్లో 2.4 లక్షల కంప్యూటర్లపై దాడిచేసిన సంగతి తెలిసిందే.