‘జేమ్స్ బాండ్’ హీరో రోజర్ మూర్ మృతి!
- 19 Views
- admin
- May 24, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు సినిమా

రోజర్మూర్ 1927లో లండన్‌లో జన్మించారు. పాతికేళ్ల వయసులో మోడలింగ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ఇంటరెప్టెడ్ మెలోడీ’, ‘కింగ్స్ థీఫ్’ తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. తొలి రోజుల్లో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెర వైపు వెళ్లారు. ‘ది సెయింట్’, ‘ది పర్సేడర్స్’ లాంటి టీవీ కార్యక్రమాలతో ఆయనకు మంచి పేరొచ్చింది. వీటి ద్వారా ఆయనకు హాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. 1973లో వచ్చిన ‘లివ్ అండ్ లెట్ డై’తో ఆయన దశ మారిపోయింది. ఈ చిత్రంలో ఆయన తొలిసారి జేమ్స్ బాండ్ పాత్రలో నటించారు. ఆ పాత్రకు తనదైన స్టైల్, మేనరిజమ్స్ జోడించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. జేమ్స్ బాండ్ చిత్రాల నుంచి సీన్ కానరీ తప్పుకున్నాక ఆ పాత్రలో అంతబాగా ఇంకెవరు నటిస్తారన్న ప్రశ్నకు మూర్ సమాధానంగా నిలిచారు. దీంతో 12 ఏళ్ల కాలంలో మొత్తం ఏడు చిత్రాల్లో బాండ్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. అత్యధిక కాలం బాండ్ పాత్రలో నటించిన నటుడిగా నిలిచారు. బయట కూడా ఆయన్ను మిస్టర్ బాండ్ అనే పిలిచేవారట. 58 ఏళ్ల వయసు వరకూ ఆయన బాండ్‌గా నటిస్తూనే ఉన్నారు. చివరకు 1985లో బాండ్ చిత్రాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 1990 వరకు వేరే చిత్రంలో నటించలేదు. తదుపరి ‘స్పైస్ వరల్డ్’, ‘బోట్ ట్రిప్’ లాంటి చిత్రాల్లో కనిపించారు.
బెరుకు ఎక్కువ: జేమ్స్‌బాండ్ చిత్రాలంటే పోరాటాలతో పాటు కథానాయికలతో రొమాన్స్ పాళ్లూ ఎక్కువే. అయితే ఆ సన్నివేశాల్లో నటించాలంటే తనకు బెరుకుగా ఉండేదని చెప్పేవారు మూర్.
మిలియనీర్ బాండ్: జేమ్స్ బాండ్ పాత్ర రోజర్మూర్కు కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టడమే కాదు.. మల్టీ మిలియనీర్‌గా మార్చేసింది. బాండ్ చిత్రాల ద్వారా ఆయన 22 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు సమాచారం. ఇప్పటివరకూ బాండ్‌గా నటించిన నటుల్లో ఆ పాత్ర ద్వారా అత్యధికంగా సంపాదించింది రోజర్ మూరే అని హాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి.
యూనిసెఫ్ ప్రతినిధిగా: సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నాక మూర్ స్వచ్ఛంద సేవపై దృష్టిపెట్టారు. ఆయన సేవలకు గాను 1999లో సీబీఈ పురస్కారం అందుకున్నారు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గానూ సేవలందించారు.
రచయితగా: రోజర్ మూర్ రచయితగానూ మారారు. బాండ్ పాత్రలో తన అనుభవాల గురించి రెండు పుస్తకాలు రాశారు. తన ఆత్మకథను కూడా రెండు పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు.
కుటుంబం: రోజర్ మూర్కు భార్య క్రిస్టీనా థోల్స్ట్రప్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో మూర్ చేసుకున్న మూడు వివాహాలు విఫలమై విడాకులు తీసుకున్నారు. 74 ఏళ్ల వయసులో క్రిస్టీనాను నాలుగో వివాహం చేసుకున్నారు.


