మాంచెస్టర్ మారణహోమం ఆ కుర్రాడిదే
- 8 Views
- admin
- May 24, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు


అబేదీ కుటుంబం లిబియా దేశానికి చెందిన వారు. కొన్నేళ్ల క్రితం వారు మాంచెస్టర్‌లోని ఫాలోఫీల్డ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అబేదీ కూడా అక్కడే జన్మించాడు. మాంచెస్టర్‌లో అబేదీ కుటుంబానికి మంచి పేరుండేది. అతడి తండ్రి రమదాన్ స్థానిక మసీదుల్లో ప్రార్థనలు చేసేవారు. అయితే అబేదీ పుట్టిన సమయంలో మాంచెస్టర్‌లో పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండేవి కావు. దీంతో అబేదీ కుటుంబం లిబియాకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి అబేది కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నా.. అబేది మాత్రం చదువుకోవటానికి మాంచెస్టర్‌కు తిరిగి వచ్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండే అబేదీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయాలని అనుకునేవాడట. అందులో భాగంగా 2014లో మాంచెస్టర్‌కు వచ్చిన అబేదీ.. సాల్ఫోర్డ్ యూనివర్శిటీలో చేరాడు. రెండేళ్ల పాటు అతడి విద్యాభ్యాసం సాఫీగానే సాగినట్లు చెబుతున్నారు. అబేదీ ఎప్పుడూ మౌనంగా ఉండేవాడని.. పెద్దల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించేవాడని అతడి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఎవరితోనైనా సున్నితంగా మాట్లాడేవాడన్న పేరున్నట్లు తెలుస్తోంది. అలాంటి అబేదీకి ఉన్నట్లుండి ఏమైందో కానీ.. 2016లో మధ్యలోనే చదువు ఆపేశాడు. యూనివర్శిటీ వసతిగృహం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేనట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఈ మధ్య కాలంలోనే అబేదీ త్రీవవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకోసమే అతడు చదువును వదిలేసి ఉండొచ్చన్న సందేహాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాన్ని బలపరిచేలా మాంచెస్టర్ దాడిలో ఉపయోగించిన శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని అబేదీ తన ఇంట్లోనే తయారు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేయాలనుకున్న ఒక యువకుడు ఆత్మాహుతి సభ్యుడిగా ఎలా మారాడు? అన్నది ఇప్పుడు పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. అబేదీకి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించటం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


