
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతికాముకులని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏపీలో తక్కువ అని చెప్పారు. ఫ్యాక్షన్ తరహా కొన్ని శాంతిభద్రతల సమస్యలు వున్నాయన్నారు. నాగరిక సమాజంలో అభివృద్ధికి శాంతిభద్రతలు అతి ముఖ్యమని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ లీడర్లపై నిరంతర నిఘా వుంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రోడ్ కనెక్టివిటీతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విజయవాడలో ఇంటి రెంట్లను నియంత్రించాలని సూచించారు. హోటళ్లలో కూడా రేట్లు పెంచేశారని ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను ముందుగానే తనిఖీలు చేయాలని తెలిపారు. ర్యాగింగ్ జరగడానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని ప్రతిష్ట పెరిగేలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లకు నగరంలో అవకాశం ఇవ్వరాదని తెలిపారు. పిడుగురాళ్ల-గుంటూరు రహదారి విస్తరణ చేసి ప్రమాదాలు అరికడతామన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.