అశోక్ మనస్థాపం?
- 24 Views
- admin
- May 26, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా: విజయనగరం సంస్థానాధీశుల ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీకి వెన్నుముక కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మనస్థాపం చెందారు. తన కళ్ల ముందే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన కలత చెందుతున్నారు. ఇది పార్టీ భవిష్యత్‌కు మంచి పరిణామం కాదని తొలినుండి తెలుగుదేశం పార్టీలో ఆయనను వెన్నంటి ఉన్న నేతలంతా హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల అశోక్ బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలన్నీ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా? లేదా? ఆయన ఆజ్ఞలతోనే తెలుగుదేశం పార్టీలో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి విజయనగరం జిల్లాలో అశోక్‌గజపతిరాజు చెప్పిందే వేదం. ఆ మాటకొస్తే, ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిన వారికే ఇష్టం లేకున్నా సరే చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కొన్నిసార్లు పార్టీ సంక్షేమం దృష్ట్యా పార్టీ అధినేత చంద్రబాబుతో అంతర్గతంగా సంఘర్షణ పడి పార్టీ కోసం పనిచేసిన వారిని అశోక్‌గజపతిరాజు కాపాడుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికల విషయంలో అశోక్ కలత చెందారు. పార్టీలో ప్రజాస్వామ్యం పేరుతో చర్చ జరుగుతున్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు నివురుగప్పిన నిప్పులా పనిచేస్తున్నారనడంలో సందేహం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన గంటా శ్రీనివాసరావు అధ్యక్ష ఎన్నిక వ్యవహారంలో మితిమీరి వ్యవహరించారనే బాధ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇక అధ్యక్ష ఎన్నిక విషయానికొస్తే పార్టీ కష్టాల్లో ఉన్ననాటి నుండి నేటి వరకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షునిగా ఉన్నారు. మరోసారి ఆయన ఈ పదవిని ఆశిస్తున్నట్లే చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అశోక్‌గజపతిరాజు ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు ఆదేశాలను పాటిస్తూ, జగదీష్ పార్టీ నిర్మాణాన్ని జాగ్రత్తగా చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా విజయనగరంలో పార్టీ పరంగా ప్రధమ స్థానంలో నిలిపిన ఘనత జగదీష్‌కు దక్కుతుందడంలో సందేహం లేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు అధ్యక్ష పదవిని భారంగా భావించి, అటువైపు కన్నెత్తి కూడా చూడని నేతలునేడు పార్టీ అధికారంలో ఉందన్న ఆశతో అధ్యక్ష పదవిని ఆశిస్తుండడం సీనియర్ నేతగా అశోక్ గజపతిరాజు భరించలేకపోతున్నారు. బొత్స కుటుంబానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పదేళ్ల పాటు నడిపిన ఘనత నిస్సందేహంగా జగదీష్‌కే దక్కుతుండడంలో సందేహం లేదు. అందువల్లనే అశోక్‌గజపతిరాజు మాత్రం మరోసారి తన మనసులో మాటను బయటపెడుతూ జగదీష్‌నే అధ్యక్షునిగా ఉంచాలని భావిస్తున్నారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి పరిశీలిస్తే అశోక్ నోటి వెంట వెలువడిన మాటే శాసనం. అందువల్ల అక్కడితోనే అధ్యక్ష ఎన్నిక ముగిసిపోతుందని అంతా భావించారు. అయితే ఇన్‌ఛార్జి మంత్రి గంటా దూకుడుగా ముందడుగు వేసి మీ సమక్షంలో మాట్లాడేందుకు నాయకులు భయపడతారని చెప్పి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అశోక్‌గజపతిరాజు నాయకత్వంపై నిజంగా నమ్మకం ఉంటే అక్కడ ఉన్న నేతంలా మంత్రి గంటా మాటను ఖండించి ఉండాల్సిందేనని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతా మౌనంగా ఉండిపోవడంతో కలత చెందిన అశోక్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత ఇంతవరకు తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ సంస్థాగత కార్యక్రమంలో కనిపించలేదు. జాతీయ నాయకునిగా ఆయనకు ఢిల్లీ స్థాయిలో తీరిక లేని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ విజయనగరం జిల్లా రాజకీయాలను ఆయన ఏనాడూ విడిచిపెట్టలేదు. తొలిసారిగా ఆయన లేకుండానే ఇక్కడి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. కనీసం ఈ విషయంలో చంద్రబాబు కూడా పట్టించుకోకపోవడం పట్ల ఐవిపి రాజు వంటి నాయకులు బాధపడుతున్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పట్ల ఐవిపి కూడా కలత చెందారు. ఇదే విషయాన్నిఆయన మూడు రోజుల కిందట జరిగిన మినీ మహానాడు వేడుకల్లో ధైర్యంగానే, బహిరంగంగానే చెప్పగలిగారు. వాస్తవానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య పదవి ఇంతవరకు పెద్ద విషయమేమి కాదు. అశోక్‌గజపతిరాజుపై పరోక్షంగా ధిక్కారస్వరం వినిపిస్తున్న నాయకులు దీన్ని వేదికగా చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం వల్లే ఇది చర్చగా మారింది. అధ్యక్ష పదవిపై పీఠముడిపడింది. జగదీష్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవారి అర్హతలు తక్కువనే చెప్పుకోవాలి. ఇదే విషయం గుర్తించిన అశోక్‌గజపతిరాజు అందుకే జగదీష్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష పదవి రేసులో తూముల భాస్కరరావు, కొండపల్లి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుటుంబీకులు, ఎమ్మెల్యే కోళ్ళ లతితకుమారి భర్త రాంప్రసాద్, మాజీ మంత్రి కిమిడి మృణాళిని భర్త గణపతిరావు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తూముల భాస్కరరావు విషయానికొస్తే ఆయన సతీమణి అచ్యుతవల్లి బొబ్బిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అదే నియోజకవర్గం నుండి సుజయ్‌కృష్ణ రంగారావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అందువల్ల మరో పదవి బొబ్బిలికి ఇవ్వడం సముచితం కాదనే వాదన ఉంది. గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు సోదరుడు కొండపల్లి అప్పలనాయుడు ఇంతవరకు మండల స్థాయి పదవులను దాటి చేయలేదు. గతంలో ఆయన పార్టీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించలేదు. ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుమారుల పరిస్థితి కూడా దాదాపుగా అంతే. అంతేకాకుండా ఈ కుటుంబానికి బొత్స కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అపవాదు కూడా ఉంది. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లతితకుమారి భర్త రాంప్రసాద్ విషయానికొస్తే, గతంలో లలితకుమారి జిల్లా పార్టీ అధ్యక్షరాలిగా పనిచేసారు. ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు తి.తి.దే సభ్యురాలిగా కూడా ఉన్నారు. అందువల్ల ఈ ఇంటికి మూడో పదవి ఇవ్వడం గగనమే. మాజీ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని భర్త గణపతిరావు విషయానికొస్తే ఆయన సోదరుడు కిమిడి కళా వెంకటరావు ఒకవైపు మంత్రిగాను, మరోవైపు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగాను ఉన్నారు. అందువల్ల ఆయనకు కూడా కష్టమే. శోభా హైమావతి విషయానికొస్తే ఆమె ప్రస్తుతం రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగాను, అంగన్వాడీ కార్యకర్తల సంఘం రాష్ట్ర ఇన్‌ఛార్జిగాను పనిచేసారు. ఆమె కుమార్తె డాక్టర్ శోభా స్వాతిరాణి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గాను పనిచేస్తున్నారు. ఆమె అల్లుడు గుళ్లపల్లి గణేష్ ఇప్పటికే విజయనగరం జిల్లా రాజకీయాల్లో మితిమీరి వ్యవహరిస్తున్నారన్న చెడ్డపేరు ఇప్పటికే ఉంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం హైమావతికి మైనస్‌గా మారే అవకాశం ఉంది. అందువల్లనే ఇవన్నీ ఆలోచించిన అశోక్‌గజపతిరాజు జగదీష్ వైపే మొగ్గుచూపారని చెప్పుకోవచ్చు. అయితే తన నిర్ణయాన్ని మంత్రి గంటా రూపంలో నాయకులు వ్యతిరేకించడాన్ని అశోక్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో అశోక్ ఇమేజ్‌తోనే మరోసారి విజయం సాధించాల్సి ఉందని, ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న వారి వల్ల సాధ్యం కాదని పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


