న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ ఇండియాలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ జంటనగరమైన అహ్మదాబాద్‌లో మూడు కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించింది. ముగ్గురిలో బాపూనగర్‌కు చెందిన ఒక గర్భవతి కూడా ఉన్నట్టు సంస్థ తెలిపింది. పగలు కుట్టే ఏడిస్ దోమల వల్ల వ్యాపించే ఈ వ్యాధి గర్భవతులకు వస్తే పిల్లలు లోపాలతో పుడుతారు. మెదడు ఎదుగుదల ప్రభావితమై తల చిన్నదిగా ఉండిపోతుంది. వైద్య పరిభాషలో దీన్ని మైక్రోసెఫాలి అంటారు. అంధత్వం, చెవుడు, మూర్ఛవ్యాధి కూడా రావచ్చు.
భారత వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మూడు కేసులను నివేదించినట్టు డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 50 వేల పరీక్షలు జరుపగా కేవలం మూడు కేసులలో మాత్రమే జికా వైరస్ ఉన్నట్టు తేలిందని వైద్యశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీలో ముందుగా పరీక్షలు జరిపారు. తర్వాత పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లోనూ శాంపిల్స్‌పై పరీక్షలు జరిపారు. జికా కేసులు భారత్‌లో వైరస్ వ్యాప్తిని సూచిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నది. ప్రస్తుతం వ్యాప్తి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో విస్తరించే ప్రమాదముందని హెచ్చరించింది. నివారణ కార్యక్రమాలు, నిఘా పెంచాలని సూచించింది.