
కన్నీటి పర్యంతమైన మోహన్ బాబు
దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తను తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కిమ్స్ ఆసుపత్రి వద్దకు సినీ పరిశ్రమ పెద్దలు అక్కడికి తరలివస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు మోహన్ బాబు అక్కడికి హుటాహుటిన వచ్చారు. దాసరి మృతిపట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో దాసరి భౌతికకాయం వద్ద మోహన్‌బాబుతో పాటు దర్శకుడు కోడి రామకృష్ణ ఉన్నారు. అభిమానులెవ్వరూ ఆసుపత్రి వద్దకు రావద్దని దాసరి సన్నిహితులు సూచిస్తున్నారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి చెందారన్న వార్తను ఆయన శిష్యుడు, సినీనటుడు మోహన్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మరణవార్త వినగానే ఆసుపత్రికి వచ్చిన మోహన్ బాబు మీడియా ముందే విలపించారు. ‘ఒక చరిత్ర ముగిసిపోయింది.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆయన సేవలు మర్చిపోలేనివి.. నాకు నటుడిగా జన్మనిచ్చారు…’ అంటూ ఏదో చెప్పబోతూనే ఉద్వేగంతో కన్నీరు పెట్టుకొని మాట్లాడలేకపోయారు.
ఒక మాటలో చెప్పాలంటే ఈ వార్త నాకు షాక్‌లాంటిది: ఏపీ సీఎం చంద్రబాబు
