రాజమౌళి దర్శకత్వంలోనే ఎన్టీఆర్..?
- 12 Views
- admin
- June 5, 2017
- Home Slider తాజా వార్తలు సినిమా

భారీ పారితోషికం
బుల్లితెరపై విజయవంతమైన కార్యక్రమం… బిగ్‌బాస్. హిందీలో సల్మాన్‌ఖాన్‌లాంటి అగ్ర కథానాయకులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరహా కార్యక్రమం తెలుగులోనూ నిర్వహించబోతున్నారు. తెలుగులో కార్యక్రమం నిర్వహణ కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించారు. మాస్లో విశేష ఆదరణని సొంతం చేసుకొన్న ఎన్టీఆర్‌తో కార్యక్రమ నిర్వహణకి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలిసింది ఓ కార్పొరేట్ సంస్థ. అందుకోసం ఆయనకి భారీగా పారితోషికం అందజేస్తున్నట్టు సమాచారం. ‘బిగ్‌బాస్’తో బుల్లితెరపై సందడి చేసిన అగ్ర తారల జాబితాలోకి ఎన్టీఆర్ చేరబోతున్నారు. చిరంజీవి, నాగార్జునలాంటి కథానాయకులు ఇప్పటికే బుల్లితెరపై విజయవంతంగా మెరిశారు.
నాలుగోసారి…
‘జై లవకుశ’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఆయన తదుపరి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలోనే నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వారిద్దరి కలయికలో నాలుగో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకు ‘స్టూడెంట్ నెంబర్ 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాలు చేశారు. నాలుగో చిత్రం అనేది ఒకెత్తయితే, రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడం మరో ప్రత్యేకమైన విషయం అవుతుంది. అయితే ఆ చిత్రం గురించి ఇటు రాజమౌళి కానీ, అటు ఎన్టీఆర్ కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు. తెలుగు సినిమా వర్గాలు మాత్రం రాజమౌళి తదుపరి డి.వి.వి.దానయ్య నిర్మాణంలో సినిమా చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్ కథానాయకుడని చెబుతున్నాయి.


