దూకుడు తగ్గింది
- 13 Views
- admin
- June 17, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు స్థానికం
పార్టీ కోసం పాలసీ మార్చేసిన పౌర విమానయాన మంత్రి
అక్కడ అలా … ఇక్కడ ఇలా…
శివసేనకు ఒక న్యాయం టీడీపీకి మరో న్యాయం
మంత్రి అశోక్ తీరుపై అనుమానాలు
గజపతిరాజును రోడ్డు మీద నిలబెట్టేసిన దివాకర్
పేరు ప్రతిష్టలకు మచ్చ
ఎంపీ రెడ్డిపై పట్టు బిగించిన విమానయాన సంస్థలు
పెద్దాయన మనసు మారిపోయింది. దేశ వ్యాప్తంగా మంచి పేరు గడించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మనసే కాదు మనిషే మారిపోయారట. ఇది జనం మాట. ప్రజలందరి ఆవేదన. అంత మంచాయన ఒక్కసారిగా ఎందుకు అలా తయారయ్యారన్నదే పెద్ద ప్రశ్న అయ్యింది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు నీతి నియమాలకు పెట్టింది పేరు. ఎవరికీ తల వంచని వ్యక్తిత్వం. ఏ విషయాన్నైనా కుండ బద్దల కొట్టి చెప్పే మనస్తత్వం. అవినీతి మలినం అంటని నిఖార్సయిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చిన నేత. ప్రస్తుత ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది ఆయన గురించి క్లుప్తంగా. ఇక అసలు విషయానికి వద్దాం.
ఈ ఏడాది మార్చిలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పూనే విమానాశ్రయంలో ఎయిరిండియా ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. దీంతో విమానయాన సంస్థలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగాయి. ఉద్యోగులకు సంఘీభావంగా మంత్రి అశోక్ గజపతిరాజు నిలిచారు. సాక్షాత్తు పౌర విమానాల మంత్రే రంగంలోకి దిగడంతో వ్యవహారం ముదిరిపోయింది. గైక్వాడ్‌ను విమానాలు ఎక్కకుండా హుకుం జారీ అయ్యింది. ఈ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. దాదాపు రెండు వారాలపాటు సాగిన వ్యవహారంలో మంత్రి అశోక్ గజపతిరాజు బాహుబలి మాదిరిగా నిలిచారు. సహనం కోల్పోయిన సహచర పార్లమెంట్ సభ్యులు ఒక దశలో అశోక్ గజపతిపై దాడికి సైతం దిగారు. అయినా తగ్గలేదు. చిట్ట చివరకు లోక్‌సభ స్పీకర్ సహా ప్రధాన మంత్రి కలుగుజేసుకుని వ్యవహారానికి శుభం కార్డు వేశారు. ఇదంతా జరిగి రెండు నెలలు అయింది. ఆ వ్యవహారంలో అశోక్ హీరో అయ్యారు. దేశ ప్రజలు నిరాజనలు పట్టారు. విమానయాస సంస్థ సంబరపడిపోయాయి. తమకు భరోసా దొరికిందని ఉద్యోగులు సంతోష పడ్డారు.
ఇక తాజా వ్యవహారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం నానా యాగీ చేశారు. ఇండిగో విమాన సంస్థ ఉద్యోగులపై దాడి చేశారు. బోర్డింగ్ పాస్ యంత్రాన్ని పైకి ఎత్తి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా గౌరవ మంత్రి అశోక్ గజపతి రాజు సొంత ఊరులో జరిగింది. ఈ వ్యవహారంపై దేశ ప్రజలంతా ఎంతో ఆశక్తితో చూశారు. గైక్వాడ్ తరహాలో ట్రీట్మెంట్ ఉంటుందని అంతా భావించారు. కానీ గౌరవ మంత్రి యూ టర్న్ తీసుకున్నారు. సొంత పార్టీ ఎంపీ కావడంతో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పూనే ఘటనలో శివసేన ఎంపీ కావడంతో ఆయన తన అధికారాన్ని ఉపయోగించారు. ఇక్కడకు వచ్చేసరికి ఎంపీ దివాకర్ రెడ్డి విషయంలో ఏమీ చేయలేని నిశ్శాహాయ స్థితికి చేరుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బరువైన మాటలు చెబుతున్నారు. అంతే కాదు బస్టాండ్‌లో గొడవ జరిగితే మంత్రి కలుగుజేసుకుంటారా? అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. బాహుబలి లాంటి మనిషి దివాకర్ రెడ్డి విషయంలో బలి అయిపోయారు. పార్టీ చీఫ్ చంద్రబాబు నిర్ధేశకత్వంలో అశోకుడు నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. దివాకర్ రెడ్డి విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దని పై నుంచి ఆదేశాలు అందాయట. అందుకే అశోకుడు ప్రజల దృష్టిలో ఒక్కసారిగా విలన్ అయిపోయారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు దివాకర్ రెడ్డి పుణ్యమాని రోడ్డు మీద పడిపోయింది.


