విశాఖ భూ కుంభకోణంపై బాబు ”మెట్రో” సమ్మోహనాస్త్రం
- 9 Views
- admin
- June 17, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
కేంద్రం మెట్రోరైల్ పాలసీని ప్రకటించకుండానే రాష్ట్ర నోటిఫికేషన్ ఎలా సాధ్యం
ప్రజా పెట్టుబడుల మండలి అనుమతి ఏమయ్యింది?
విశాఖపట్నంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణాల వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు సర్కార్ పావులు
కదుపుతోంది. మరోసారి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి
చిత్తశుద్ధి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల్లో మెట్రోరైల్ పాలసీని ప్రకటించనున్నది. ఏ రాష్ట్రమైనా మెట్రో రైలు చేపట్టాలంటే
కేంద్రం ప్రకటించే పాలసీకి అనుగుణంగా ఆ ప్రాజెక్టు ఉండాలి. కేంద్రం పాలసీ ప్రకటించే వరకూ ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ
మెట్రోరైలుకు సంబంధించి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసింది. కేంద్రానికి చెందిన ప్రజా పెట్టుబడుల మండలి (పి.ఐ.బి)
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటి కాదనే కారణంతో అనుమతి ఇవ్వలేదు. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇంత వరకూ
రాష్ట్ర ప్రభుత్వం పి.ఐ.బి.కి పంపలేదు. పి.ఐ.బి. అనుమతి లేకుండా మెట్రో పనులు చేపట్టడం సాధ్యం కాదు. 42.5 కిలోమీటర్ల పొడవైన
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి 9500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఇది వాస్తవ అంచనాలకు దూరంగా ఉంది.
మెట్రో రైలు మార్గ నిర్మాణానికి సగటున కిలో మీటరుకు రూ.300 కోట్లు వ్యయం అవతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన
విశాఖ ప్రాజెక్టుకు రూ. 12,750 కోట్ల వ్యయం అవుతుంది. అలాంటిది మూడు వేల కోట్ల రూపాయలు తగ్గించి ఎలా చెబుతున్నారో ఎవరికీ
అర్ధం కాదు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకన్నా ఎంతో ముందుగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే అమరావతిపై
ఆసక్తితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిని మరుగున పడేసి విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చిందనే అపవాదు
లేకపోలేదు. విశాఖలో భూ కుంభకోణం వెలుగులోకి రావడంతో అక్కడి ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం
ముందుకు తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భూములు భాగోతాన్ని పాతరేసేందుకు సర్కార్ ఎత్తుగడ అని ప్రతిపక్షాలు
విమర్శిస్తున్నాయి.


