బాబుకు స్టాలిన్ సవాల్
- 18 Views
- admin
- June 19, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
తిరుపతి, ఫీచర్స్ ఇండియా: అన్నాడీఎంకే అస్థిర ప్రభుత్వం వల్లే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా చెక్ డ్యాంలు నిర్మిస్తోందని, వీటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మిన్నకుండి పోయిందని తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డాడు.
పాలారు, కుశస్థల నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించి చెక్ డ్యాంలు నిర్మిస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని పాలారు ప్రాంతంలో ఎంకే. స్టాలిన్ ప్రత్యక్షం అయ్యారు. ఎవ్వరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్టాలిన్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్ డ్యాంలు పరిశీలించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్ డ్యాంలు పరిశీలించిన స్టాలిన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతరాష్ట్ర నదీజలాల పంపిణి నియమాలు ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమిళనాడు సరిహద్దులో చెక్ డ్యాంలు నిర్మిస్తున్నదని స్టాలిన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డంగా చెక్ డ్యాంలు నిర్మిస్తున్నా తమిళనాడు ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. అసలు తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అనే విషయం మాకే తెలీదంటూ మీడియా ముందు ఎంకే స్టాలిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చెక్ డ్యాం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డంగా 50 అడుగుల ఎత్తులో కోట్ల రూపాయల వ్యయంతో భారీ డ్యాం నిర్మిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. చెక్ డ్యాంకు డ్యాంకు ఎంతో తేడా ఉందని అన్నారు. చెక్ డ్యాం కేవలం నాలుగు లేదా ఐదు అడుగుల ఎత్తులో మాత్రమే నిర్మిస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 50 అడుగుల ఎత్తులో చెక్ డ్యాం నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. 4.50 లక్షల ఎకరాలు ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ డ్యాం ముసుగులో నిర్మిస్తున్న భారీ డ్యాం కారణంగా వేలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, తిరువళ్లూరు, చెన్నై ప్రాంతంలో దాదాపు 4.50 లక్షల ఎకరాల సాగు భూమి బీడుగా మారే అవకాశం ఉందని స్టాలిన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలారు, కుశస్థల నదులపై చెక్ డ్యాంలు నిర్మించుకుంటున్న విషయం తెలిసినా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ఎందుకు చంద్రబాబు నాయడుతో మాట్లాడటం లేదని, ఈ విషయం ఎందుకు పట్టించుకోవడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి తన కుర్చీ కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని, అన్నాడీఎంకే పార్టీ అస్థిరపాలనతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని స్టాలిన్ ఆరోపించారు. ఇవేమి పట్టించుకోకుండా కేవలం తమ మనుగడ కోసమే పళనిసామి నిమగ్నం అయ్యారని స్టాలిన్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అంటే పళనిసామికి ఎందుకు అంత భయం అని స్టాలిన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ డ్యాంలు నిర్మించడంతో వేలూరు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు రావాల్సిన నీరు రాకపోవడంతో ఇక్కడి రైతులు జీవనోపాది కోల్పోయారని స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో ఏర్పడే నీటి సమస్యలపై తక్షణం పరిష్కారం కోసం తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. లేకుంటే మేమే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తమిళనాడు సీఎం పళనిసామి ప్రభుత్వాన్ని స్టాలిన్ హెచ్చరించారు.
కాగా చెక్ డ్యాంలు నిర్మాణం వలన తమిళనాడు రైతుల్లో నెలకోని ఉన్న భయాందోళనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివ తి చేయడమే కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంకే. స్టాలిన్ మనవి చేశారు. స్టాలిన్‌తో పాటు తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్, ఎమ్మెల్యేలు గాంధీ, నందకుమార్, నల్లతంబి, డీఎంకే నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్ డ్యాంలు పరిశీలించారు