లండన్: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగి సంచలనం సృష్టించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో అతడి ఏడాది పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీమిండియా సారథి కోహ్లీ, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. బీసీసీఐ పాలకుల కమిటీ, గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా సంఘం వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. లండన్ నుంచి కోహ్లీసేన విండీస్ పర్యటనకు బయలుదేరినా, ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు కుంబ్లే అక్కడే ఉండిపోయాడు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన విండీస్‌కు పయనమవుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కుంబ్లే ఏడాది పదివీ కాలం నేటి (మంగళవారం)తో పూర్తవుతుంది. కోచ్‌గా కొనసాగడం ఇష్టంలేదని ఆయన తన పదవి నుంచి వైదొలగారు. అయితే బీసీసీఐకి కోచ్ పదవి కోసం ఆయన కొత్తగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.