విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను బరిలో దింపుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు ఎవరిని తమ అభ్యర్థిగా బరిలో దింపుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో భేటీ అయిన విపక్షాలు తమ అభ్యర్థిగా మీరాకుమార్ను పోటీలో నిలుపుతున్నట్టు స్పష్టంచేశాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థులుగా మీరాకుమార్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మీరాకుమార్ వైపే మొగ్గుచూపాయి. దీంతో జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌తో మీరాకుమార్ తలపడనున్నారు. మీరా గతంలో కేంద్రమంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఈ నెల 27 లేదా 28న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె నామినేషన్ పత్రాలపై సంతకాల కార్యక్రమాన్ని కూడా విపక్షాలు ప్రారంభించాయి.