బ్రాహ్మణి రాక తప్పదా?
- 8 Views
- admin
- June 23, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అమరావతి, ఫీచర్స్ ఇండియా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలమైనవనే విషయం అందరికి తెలిసిందే. అయితే రాజకీయ పార్టీలకు ప్రత్యర్ధుల మీద ఘాటుగా, షూటిగా విమర్శలు చేయాలంటే కచ్చితంగా మహిళా నాయకురాళ్ళు ఉండాలి. ఈ విషయంలో వైకాపాకు ఎలాంటి కొదవ లేదు. ప్రస్తుతం వైసీపీలో బలమైన మహిళా నాయకురాలుగా రోజా వుంది. ఆమె చంద్రబాబు మీద, మిగిలిన నాయకుల మీద ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అందరికి తెలిసిందే. ఆమె మాటల దాడిని తట్టుకోవడం అసలు టీడీపీకి సాధ్యంకాని స్థాయిలో విమర్శలు చేస్తూ వుంటుంది. ఒక్కో సారి నాయకులు చెప్పుకోలేని స్థాయిలో ఆమె నోటి నుంచి మాటలు వస్తూ వుంటాయి. అయితే మన రాజకీయాల్లో ఎంత అవినీతి, అక్రమాలు ఉన్న, మహిళ రాజకీయ నాయకురాళ్ళ మీద మన నాయకులు నేరుగా ఘాటుగా విమర్శలు చేయడానికి భయపడతారు. ప్రత్యర్ధి పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళని ఎదుర్కొనేందుకు మహిళలనే అన్ని రాజకీయ పార్టీలు ప్రయోగిస్తాయి.
ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీకి మాత్రం ఈ విషయంలో కాస్తా కష్టంగా ఉందనే చెప్పాలి. రోజా స్థాయిలో ఘాటుగా విమర్శలు చేసేంత దమ్మున్న మహిళలు పార్టీలో లేకపోవడం చంద్రబాబుని బాధిస్తోంది. వంగలపూడి అనిత, పరిటాల సునీత, వంగా గీత వంటి మహిళలు ఉన్నా రోజా స్థాయిలో మాట్లాడే ధైర్యం వారికి లేదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో బలమైన మహిళా నాయకురాళ్లు టీడీపీకి చాలా అవసరం.
అయితే ఇప్పుడు టీడీపీలో మహిళా నాయకురాలుగా అయ్యే గొప్ప లక్షణాలు వున్న మహిళా నేతగా అందరూ చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని చూపిస్తున్నారు. ఆమె మాటల్లో ధైర్యం, కచ్చితత్వం, ఎదుటి వారికి మాట్లాడే అవకాశం లేకుండా పక్కా సమాచారంతో విమర్శించే నైపుణ్యం ఆమెలో ఉన్నాయని అందరు అనుకుంటున్నారు. అందుకే ఆమెను టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావాలని, వైకాపాను ఎదుర్కోవాలంటే నారా బ్రాహ్మణి సరైన నాయకురాలని టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అయితే దీనిపై చంద్రబాబు ఆలోచన ఏంటనేది పార్టీలో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. భవిష్యత్తులో టీడీపీని కాపాడుకోవాలంటే నారా బ్రాహ్మణి వలెనే సాధ్యమౌతుందని టీడీపీలో చాలా మంది విశ్వసిస్తున్నారు. మరి భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి రూపంలో మహిళా నాయకత్వం వస్తుందేమో చూడాలి.


