ఎన్ఏడీలో ట్రాలర్ భీభత్సం-తిరగబడిన కంటైనర్
- 14 Views
- admin
- June 24, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
తప్పిన పెను ప్రమాదం – హిజ్రా మృతి, ఇద్దరికి గాయాలు
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా : ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన్.ఏ.డీ(సిగ్నల్స్) జంక్షన్ వద్ద శనివారం ఉదయం 11గంటల సమయంలో బిర్లా జంక్షన్ నుండి జాతీయ రహదారిపై గాజువాక వెళ్తోన్న భారీ కంటైనర్‌ను తీసుకెళ్తున్న ఏపీ 31టీఈ 0576 గల ట్రాలర్ భీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో సబీనా(45) అనే హిజ్రా కంటైనర్ కింద నలిగి మృతి చెందగా, ఓ మోటారు సైక్లిస్టుతో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల క్రితం భీమవరం నుండి నగరానికి వచ్చిన సబీనా అనే హిజ్రా ధర్మనగర్ లో నివాసముంటోంది. ప్రతీ రోజూ మాదిరిగానే హిజ్రా సబీనా ఎన్.ఏ.డి జంక్షన్లో భిక్షాటన చేసుకుంటోంది. ఆ సమయంలో భారీ కంటైనర్‌ను తీసుకొస్తున్న ట్రాలర్, సిగ్నల్‌ను అధిగమించేందుకు అతివేగంతో వస్తోంది. సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడటంతో ట్రాలర్ డ్రైవర్ సడన్‌గా బ్రేకులు వేయడంతో ఒక్కసారి ట్రాలర్ అడ్డంగా తిరగడమేకాకుండా, దానిపైనున్న కంటైనర్ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. అప్పటికే సిగ్నల్ పడిపోవడంతో వేచి ఉన్న వాహనదారులు వెళ్లిపోయారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. లేని ఎడల ప్రమాదం ఊహించని రీతిలో జరిగి ఉండేది. అక్కడ నిల్చున్న హిజ్రాపై కంటైనర్ పడటంతో గుర్తించడానికి వీలులేనంతగా మృతదేహం తయారైంది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏపీ 31సీహెచ్ 1056 నెంబరు గల మోటారుసైక్లిస్టు కూడా ప్రమాదానికి గురయ్యాడు. ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించిన పోలీసులు హిజ్రా మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించడమే కాకుండా, భారీ క్రేన్లను రప్పించి రోడ్డుపై పడిపోయిన కంటైనర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. నగరంలో అతి ప్రమాదకరమైన జంక్షన్ ఏదైనా ఉందంటే అదే ఎన్.ఏ.డి. కూడలి. తరచూ ఈ జంక్షన్లో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు తీసుకున్న చర్యలు అంతంతమాత్రమే. ఈ విషయమై ట్రాఫిక్ ఏడీసీపీ మహేంద్రపాత్రుడు మాట్లాడుతూ అతి వేగంతో రావడం వల్లనే బ్రేకులు ఫెయిలై ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమదానికి కారణమైన వాహనానికి సాంకేతికంగా భద్రతా పరమైన అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. 24గంటలూ ఈ జంక్షన్లో తమ సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్దీకరణలో నిమగ్నమై ఉంటారని, ప్రధానంగా లారీ డ్రైవర్లు, భారీ వాహనాలు నడిపే వారు అతి వేగంతో వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి గురై మృతి చెందిన హిజ్రా సబీనాకు చెందిన తోటి హిజ్రాలు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తించలేని విధంగా మృత దేహాన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మధురవాడ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, నార్త్ ఏసీపీ భీమారావు, ఎయిర్‌పోర్టు జోన్ సీఐ ప్రభాకర్, హైవే మొబైల్ ట్రాఫిక్ సీఐ సింహాచలం, అధిక సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన్ని క్షణాల్లో ట్రాఫిక్‌ను క్రబద్దీకరించారు.