చిన్నారి మృతి
- 12 Views
- admin
- June 25, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

శాయశక్తులా ప్రయత్నించాం: మంత్రి
పాపను ప్రాణాలతో తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించామని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. తొలుత చిన్నారి 40 అడుగుల లోతులో ఉందని గుర్తించామని… తర్వాత 180 అడుగుల లోతుకు జారిపోయిందని తెలిపారు. సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాపను బతికించలేకపోయామన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చిన్నారి గురువారం బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ బాలికను బయటికి తీసుకురావడానికి రెండు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినా సత్ఫలితాల్ని ఇవ్వలేదు. బోరుబావిలో ఉన్న నీటిని తోడేస్తే పాప ఆనవాళ్లు లభించొచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం 3 హెచ్పీ మోటారు, పైపులు దించినా నీళ్లు బయటకు రాలేదు. బురద కారణంగా వీలుపడలేదని నిపుణులు తెలిపారు. శనివారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు అధికారుల బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. అక్కడ్నుంచి పరికరాలు తీసుకొచ్చి పాపను బయటకు తెచ్చే ప్రయత్నం చేద్దామని జిల్లా యంత్రాంగం భావించినా అది సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ పాపను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఏడాదిన్నరకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.
బోరు యజమానిపై కేసు
బోరు పూడ్చకుండా నిర్లక్ష్యంచేసి ప్రమాదానికి కారణమైన పొలం యజమాని మల్లారెడ్డిపై పోలీసులు సెక్షన్ 336 కింద కేసు నమోదుచేశారు. వాల్టా చట్టం ప్రకారం ఎవరు బోరు వేయాలనుకున్నా ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని, బోరులో నీళ్లు రాని పక్షంలో వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత యజమానులదేనని అధికారులు తెలిపారు. జిల్లాలో పూడ్చకుండా ప్రమాదకరంగా ఉన్న బోర్లను గుర్తించి వాటిని పూడ్చివేసే బాధ్యత తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి మహేందర్రెడ్డి ఆదేశించారు.



Categories

Recent Posts

