అరకు ఎంపీ కులవివాదంపై ఆగ్రహిస్తున్న గిరిజన సంఘాలు
- 18 Views
- admin
- June 27, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
సంచలనం రేపిన ఫీచర్స్ ఇండియా కథనం
తాను రాజీ పడేది లేదంటున్న తొలిసాక్షి మహేష్
గిరిజన హక్కులు కాలరాస్తున్నారని సంధ్యారాణిపై ఆగ్రహం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత కులవివాదం కేసుపై పలు గిరిజన సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎంపీ కొత్తపల్లి గీతపై కోర్టులో కేసును దాఖలు చేసిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధపడిన విషయమై జూన్ 26న ”కేసు విత్డ్రా చేసుకుందాం” శీర్షికన ఫీచర్స్ ఇండియా దినపత్రికలో వెలువడిన వార్త సంచలనమైంది. గుమ్మడి సంధ్యారాణికి మద్దతుగా న్యాయవాది రేగు మహేష్ మొదటిసాక్షిగా ఉన్నారు. రేగు మహేష్ గతంలో మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు, సాలూరు ఎమ్మెల్యే ఆర్.పి.భంజదేవ్లపై కులవివాదం కేసులు నమోదు చేసి దేశ అత్యున్నత న్యాయస్థానంలో విజయాలు సాధించారు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్.పి. భంజదేవ్లు గిరిజన కులానికి చెందినవారు కాదంటూ సుప్రీం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కొత్తపల్లి గీత కులాన్ని సవాల్ చేస్తూ గుమ్మడి సంధ్యారాణి దాఖలుచేసిన పిటీషన్లో రేగు మహేష్ మొదటి సాక్షిగా ఉన్నారు. ఈ విషయమై రేగు మహేష్ ఫీచర్స్ ఇండియా ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గుమ్మడి సంధ్యారాణి ఈ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినా తాను మాత్రం అంగీకరించేదిలేదన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒక ఓటరుగా, న్యాయవాదిగా తాను ఇంటీరియం పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేస్తానని మహేష్ తెలిపారు. తాను మొదటి సాక్షిగా ఉన్నందున తన సాక్ష్యాన్ని ఈ కేసులో తీసుకోవాలని, హైకోర్టును కోరనున్నట్ల మహేష్ తెలిపారు. ఫీచర్స్ ఇండియాలో ప్రచురితమైన వార్తపై ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంఘాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఆదివాసి వికాష్ పరిషత్; జిల్లా గిరిజన సంఘం, ఆదివాసి సంక్షేమసంఘంతో పాటు వివిధ రాజకీయపార్టీలకు చెందిన గిరిజన నేతలు గుమ్మడి సంధ్యారాణి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సంధ్యారాణి ఉపసంహరించుకుంటే తాము కొత్తపల్లి గీతపై కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం పాకులాడే సంధ్యారాణి తోటి గిరిజన కులానికి చెందిన సంధ్యారాణి తీరులో మార్పురావాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ వివాదం తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు.