కొత్త పన్నుల్లో వినోదం
- 16 Views
- admin
- June 27, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
వస్తు, సేవలపన్ను(జీఎస్టీ) అమలుతో దేశంలో కొత్త పన్నుల శకం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతుండగా, మరికొన్ని పెరగనున్నాయి. నేటి ఆధునిక కాలంలో సగటు జీవికి మనోల్లాసాన్ని ఇచ్చేవి సినిమాలు, టెలివిజన్ ఛానెళ్లు, పార్కులు, రెస్టారెంట్లు, దాబాలు. మరి జీఎస్టీ అమలైతే వీటి ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? చూద్దాం!
సినిమాలు!
సినిమా థియేటర్లో టికెట్ ధరలను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. రూ.100 కన్నా తక్కువ ధర ఉన్న టికెట్లపై 18శాతం, రూ.100 కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలపై 28శాతం పన్నును నిర్థరించారు. జులై 1వ తేదీ నుంచి పాత వినోదపు పన్ను స్థానే కొత్త పన్నుల శ్లాబు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినోదపు పన్ను ఆధారంగా విధిస్తున్నారు. ఇది సున్నా నుంచి 110శాతం వరకూ ఉంది. ఝార్కండ్‌లో అత్యధికంగా 110శాతం ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ 60శాతం ఉంది. జీఎస్టీ అమల్లోకి వస్తే అత్యధికంగా 28శాతం మాత్రమే విధించడానికి అవకాశం ఉంది. దీంతో టికెట్ ధరలు నియంత్రణలోకి వస్తాయి.
అయితే అస్సాం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని ప్రజలకు ఇది కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో వినోదపు పన్ను సున్నాశాతంగా ఉంది.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ట టికెట్ ధరను ఒక్కసారిగా రూ.120కి చేరింది. మల్టీప్లెక్స్‌లు మినహా మిగతా సినిమాహాళ్లకు వీటిని వర్తింపజేశారు.
డీటీహెచ్, కేబుల్ సేవలు
నేటి ఆధునిక కాలంలో టెలివిజన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే డీటీహెచ్, కేబుల్ సర్వీసెస్ ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ వీటి ధరలను 18శాతానికి పరిమితం చేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 10 నుంచి 30శాతం వరకూ పన్ను వసూలు చేస్తున్నారు. దీనికి సేవా పన్ను 15శాతం అదనం. జీఎస్టీ అమలైతే 18శాతానికి మించి పన్ను వసూలు చేసే వెసులుబాటు లేదు.
అమ్యూజ్మెంట్ పార్కులు
జులై 1వ తేదీ తర్వాత అమ్యూజ్మెంట్ పార్కుల్లో టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం పార్కుల్లో సేవా పన్ను 15శాతం ఉండగా, కొత్త పన్నుల ప్రకారం 28శాతం వసూలు చేయనున్నారు.
రెస్టారెంట్లు, దాబాలు
రెస్టారెంట్లు, దాబాల్లో ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం సేవా పన్ను, వ్యాట్, స్వచ్ఛభారత్ సెస్, క్రిషి సెస్ అంటూ 20శాతం వినియోగదారుల నుంచి హోటళ్లు పిండుతున్న పన్నులు తగ్గనున్నాయి. జులై నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లలోని రెస్టారెంట్లు కేవలం 18శాతం మాత్రమే పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. నాన్-ఏసీ రెస్టారెంట్లు 12శాతం, ఉండగా, ఏసీ రెస్టారెంట్లు అత్యధికంగా 18శాతం పన్ను నిర్ణయించారు. రూ.50లక్షల టర్నోవర్ కన్నా తక్కువ ఉన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో ఈ పన్నును 5శాతానికి పరిమితం చేశారు.
జీఎస్టీ ప్రకారం 18శాతానికి పన్నులను పరిమితం చేసినా సేవా రుసుములు మాత్రం ఆయా రెస్టారెంట్లను బట్టి వసూలు చేస్తారు.
క్రికెట్, కచేరీలు
ఎంతో మంది క్రికెట్ అభిమానులకు ఇష్టమైన ఐపీఎల్ టోర్నీపై 28శాతం పన్ను విధించారు. ప్రస్తుతం ఇది 20శాతం మాత్రమే ఉంది. తదనుగుణంగా స్టేడియంలో టికెట్ల ధరలు పెరగనున్నాయి. సర్కస్, థియేటర్ ఆర్ట్స్, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, డ్రామా తదితర షోల టికెట్లుపై 18శాతం పన్ను విధించారు. ప్రస్తుతం ఉన్న పన్ను కన్నా ఇది చాలా తక్కువ.


