మోదీ చెప్పిన కొద్ది గంటలకే మరో హత్య
- 16 Views
- admin
- June 30, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు
రాంచీ: గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన కొద్ది గంటలకే ఝార్కండ్‌లో మరో హత్య జరిగింది. బీఫ్ తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. అతడి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రామ్‌గఢ్ జిల్లాలోని బజర్తంద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలీముద్దిన్ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అలీముద్దిన్‌ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. అతడి కారుకు నిప్పటించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దిన్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. అలీముద్దిన్ ఆ దారిగుండా వస్తున్నాడని తెలిసి దుండగులు ముందుగానే అక్కడ వేచి ఉన్నారని.. అదను చూసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా.. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ నిన్న గుజరాత్ పర్యటనలో స్పందించిన విషయం తెలిసిందే. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. మోదీ చెప్పిన కొద్ది గంటలకే ఈ ఘటన జరగడం గమనార్హం.


