అన్న అమృతహస్తం షురూ
- 28 Views
- admin
- July 1, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
-అంగన్వాడీల్లో మహిళలకూ భోజనాలు -ప్రారంభించిన శాసనసభ్యులు
విశాఖపట్నం,న్యూస్లీడర్: రేషన్ సరుకులలో కోత విధించిన తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీలను సైతం వదల్లేదు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రతినెలా ఇచ్చే రేషన్ సరుకులకు మంగళం పాడేయడం తెలిసిందే. దీనితో శనివారం నుంచి అన్న అమృతహస్తం పథకం కింద అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలతో పాటుగా బాలింతలు, గర్భిణీలకు కూడా భోజనాలు పెట్టారు. జిల్లాలోను, నగరంలోను ఆయా నియోజకవర్గాలలో శాసనసభ్యులు శనివారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రాలలో ఈ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.చిన్మయిదేవి, అర్బన్-1 సీడీపీఓ పద్మావతి, అర్బన్-2 సీడీపీఓ ఉషారాణి, సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. కానీ, చాలీచాలని ఈ భోజనాలు చేయడానికి ఎంతమంది వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, ఐసీడీఎస్ అర్బన్-1లో 116, అర్బన్2లో 116, అనకాపల్లిలో 74 వంతున అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. ఈ కేంద్రాలలో 30వేల మంది చిన్నారులకు అక్షయపాత్ర సంస్థ 2011 నుంచి 2015 వరకు ఆహారం అందజయడం తెలిసిందే. ఇక రెండు సంవత్సరాలుగా రేషన్ డిపోల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా పిల్లలు, బాలింతలు,గర్భిణీలకు కిలోకందిపప్పు, రెండు కిలోల బియ్యం, అరలీటర్ ఆయిల్ వంతున రేషన్సరుకులు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 25 వరకు ఐసీడీఎస్ ప్రాజెక్టులు వున్నాయి. ఇందులో 15 ప్రాజెక్టులలో ఇప్పటికే అన్న అమృతహస్తం పథకం అమలులో వుంది. ఈ నేపధ్యంలో జూన్ ఒకటో తేదీనుంచి మరో 10 ప్రాజెక్టులలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి అర్బన్-1, అర్బన్-2, భీమిలి, పెందుర్తి, అనకాపల్లి, నక్కపల్లి, రావికమతం, కె.కోటపాడు, సబ్బవరం తదితర ప్రాజెక్టులలో ఈ పథకం ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇకనుంచి పిల్లలకు అన్నం, కూరగాయలతో కూడిన సాంబారుతో భోజనాలు వడ్డిస్తారు.
మధ్యాహ్న భోజనాలు
గర్భిణీలు, బాలింతలకు కూడా ప్రతిరోజూ మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రాలలో భోజనాలు వడ్డిస్తారు. అన్నం, ఆకుకూర పప్పు, పాలు, గుడ్డు ఇస్తారు. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి, ఆరోగ్య పోషణ విద్యపై అవగాహన పెంచడానికి అన్నఅమృతహస్తం పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్నారు. రేషన్డిపోల నుంచి బియ్యం, కందిపప్పు, ఆయిల్ ఇస్తారు. ఏపీ డెయిరీ సంస్థ పాలు సరఫరా చేస్తుంది.


