ఉత్తర కొరియాపై ఓపిక నశించింది
- 11 Views
- admin
- July 1, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్న ఉత్తరకొరియాలో ప్రజలకు భద్రత కరవైందని.. మానవత్వానికి విలువ లేకుండా పోయిందని ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశంతో దౌత్యపరమైన చర్యలు జరిపే యోచనలో తాము లేమని తేల్చిచెప్పారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు.. ఉత్తర కొరియా విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అనంతరం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తర కొరియాకు బద్ధ శత్రువైన దక్షిణ కొరియాలో పర్యటించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు మూన్ జాయ్ వెల్లడించారు. ఉత్తరకొరియా విషయంలో కార్యాచరణ గురించి మాత్రం బహిర్గతం చేయలేదు.
అమెరికాకు చెందిన ఓ విద్యార్ధిని ఉత్తరకొరియా 18నెలల పాటు నిర్బంధించడం.. కోమాలోకి వెళ్లిన అతను అమెరికాలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే మృతి చెందడం ఇటీవల తీవ్ర సంచలనం రేపింది. దాంతో ఇప్పటికే అంటీముట్టనట్టుగా ఉండే ఈ రెండు దేశాల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియాపై ట్రంప్ మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.


