రైతులపై కనికరం లేదా
- 21 Views
- admin
- July 1, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
హైదరాబాద్/అమరావతి, ఫీచర్స్ ఇండియా: భారత దేశమంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రైతు. సగానికి పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నారు. ఇన్ని కోట్ల మంది భారతీయులకి బువ్వ పెడుతున్నారు. కాని ఎప్పుడూ వ్యవసాయం చేసే రైతుకి దినదిన గండం నూరేళ్ళ ఆయుస్సు అన్నట్టు ఉంటుంది. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా రైతు బ్రతుకు మాత్రం మారడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ దారుణం. నాయకులు ఏసీ గదుల్లో, మీడియా వచ్చినప్పుడు మైకుల ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. మాది రైతు ప్రభుత్వం, మేము రైతుల పక్షం, వారి కోసం ఎం చేయడానికైనా మేము రెడీ. అని ఆ మాటలు దాటిపోగానే ఏసీ గదుల్లోకి వెళ్ళగానే కార్పోరేట్లకు మడుగులొత్తుతూ ప్రణాలికలు వేసుకుంటారు. మన రైతు భారతంలో ప్రతి రోజు మనం చూసే కథ ఇది. ఈ కథ మారడం లేదు, రైతుల బ్రతుకులు మారడం లేదు. అందుకే ఇప్పటికి రైతులు వ్యవసాయం చేస్తూ, అదే వ్యవసాయం కోసం వాడే ఎరువులనే తాగేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
మళ్ళీ కరీఫ్ సీజన్ మొదలైంది. వ్యవసాయం కోసం, పంటకి ఎరువుల కోసం అప్పులు చేయడానికి రైతు సిద్ధమవుతున్నాడు. అయితే ఆంధ్రా, తెలంగాణలో రైతు రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫిఫలం అయ్యాయి. దీంతో బ్యాంకుల్లో పాత భాకీలు క్లియర్ కాక, కొత్త రుణాలు పొందే అవకాశం లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలు మొదలయ్యాయి. పంటపై రుణాలు కావాలని వెళ్ళిన రైతులకి బ్యాంకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణలో జగిత్యాల జిల్లాలో పలు గ్రామాల్లో రైతులు గ్రామీణ బ్యాంకులకు వెళ్తే బ్యాంకులలో డబ్బులు లేవని బ్యాంకు అధికారులు చెప్పి రైతులందరినీ నిరీక్షించేలా చేసారు. ఉన్నదాంట్లో కొద్ది మొత్తం మాత్రం అది కొంత మంది రైతులకి ఇచ్చి బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు. అలాగే గొల్లపల్లి మండలంలో ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి తన డబ్బు తీసుకోవడానికి వస్తే ఎదో కారణం చెప్పి ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి బ్యాంకు అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆ రైతు అక్కడ ఆత్మహత్యాయత్నం చేస్తే అప్పుడు సర్ది చెప్పి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు ఉంచుకొని మిగిలిన సొమ్ము రైతుకి ఇచ్చాడు.
అలాగే ఆంధ్రాలో పలు గ్రామీణ బ్యాంకుల్లో రైతులు రుణాల కోసం వెళ్తే గత ఏడాది బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని లేదంటే ఇవ్వమని చెప్పడంతో రైతులు ఎం చేయాలో అర్ధం కాక నిరాశగా వెనుతిరిగారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కరీఫ్ సీజన్లో రైతుల గురించి కాని, వ్యవసాయం గురించి కాని అస్సలు ఆలోచించడం లేదన్నది వాస్తవం. మరి ఈ రైతుల కష్టం ఇంకెన్ని రోజులు ఉంటాయో చూడాలి.


