ధన్యవాదాలు
- 22 Views
- admin
- July 4, 2017
- Home Slider తాజా వార్తలు సంపాదకీయం స్థానికం
ప్రియమైన పాఠకులకు,
మీ, మా ఫీచర్స్ ఇండియా మల్టీ కలర్ ప్రారంభించి ఆరు నెలల కాలం పూర్తయిన సందర్భంగా ఆదరించిన మీకు శుభాభినందనలు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పరిథిగా ప్రారంభించినా అనతి కాలంలోనే తెలుగు వారందరికీ మన పత్రిక విస్తరించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం లక్ష్యంగా మనం తొలి రోజుల్లో భావించాం. కానీ ముందుకు నడిచే క్రమంలో ప్రజల అవసరాలు ఎన్నో తెలిశాయి. కేవలం ఉత్తరాంధ్ర వెనుక బాటుతనం మాత్రమే కాక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, ఔన్నత్యం బయట ప్రపంచానికి చాటి చెప్పాలని అనిపించింది. అందుకే ఆ అంశాలన్నింటికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మన రైతు, నేనూ లోకల్, క్రైం స్టోరీ, ఆలయం, మన డాక్టర్, ప్రేమతో, మగువ ఇలా విభిన్న శీర్షికల ద్వారా సమాచారాన్ని ఫీచర్స్ ఇండియా అందిస్తోంది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కోసం భిన్న రుచులతో వంటకాల తయారీపై ప్రతీ రోజూ ఓ అంశాన్ని ప్రచురిస్తున్నాం. అలా మీడియా రంగం అంచనాలకు మించి మన పత్రిక ముందుకు సాగుతోంది. ఆర్థికంగా, ఆదరణ పరంగా ప్రతికూల వాతావరణంలో మీరు పత్రిక ప్రారంభిస్తున్నారని హితులు సూచించినా ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఆ మాత్రం తెగింపు అవసరమని భావించాం. ఇప్పుడు మీ ఆదరణ మాకు కొండంత బలం చేకూర్చింది.
గత ఆరు నెలల్లో ఉత్తరాంధ్రలో జరిగిన ప్రతి అంశానికి ఫీచర్స్ ఇండియా ప్రాధాన్యతనిచ్చింది. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు, టీడీపీ మహానాడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాధర్నా, జాతీయ డాక్టర్ల దినోత్సవం, మన్యంలో విష జ్వరాలు ఇలా ప్రతీ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక సంచికలను కూడా అందించాం. మీ ఆదరాభిమానాలతో ఇప్పుడు ఫీచర్స్ ఇండియా ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఆర్ధికంగా, సామాజికంగా, చారిత్రాత్మకంగా, ఆరోగ్యపరంగా పటిష్టంగా ఉండాలని, అందుకు ఫీచర్స్ ఇండియా కీలక భూమిక పోషిస్తుందని హామీ ఇస్తున్నాం. ఈ ఆరు నెలల ప్రయాణంలో మా వెంట నిలిచిన ప్రకటన కర్తలు, చందాదారులు, పాఠకులు, మా ఉద్యోగులు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలతో…
మీ
భరణికాన రామారావు
చీఫ్ ఎడిటర్,
ఫీచర్స్ ఇండియా దినపత్రిక


