విజయవాడ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏడాదిలోనే విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని బుడమేరు వంతెన వద్దనున్న ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాహసానికి మారుపేరైన అల్లూరిని తెలుగువారు కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. అల్లూరి స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతోందన్నారు. ఆదివాసీలు మూఢనమ్మకాలను విడనాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తవ్వించిన బోర్ల నీటిని కాకుండా సెలయేటి నీళ్లను తాగడం వల్లనే ఇటీవల ఏజెన్సీలో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని అన్నారు.