సెన్సెక్స్‌కు జీఎస్టీ జోష్
- 21 Views
- admin
- July 4, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత
-సూచీ 300 పాయింట్లు అప్ -మళ్లీ 9,600 ఎగువకు నిఫ్టీ
ముంబై, జూలై 3: జీఎస్టీ అమలు దేశీయ స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది. మదుపర్ల కొనుగోళ్ల జోష్‌లో సూచీలు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు (0.97 శాతం) పెరిగి 31,221.62 వద్దకు చేరుకుంది. ఈ నెలలో సూచీకిదే అతిపెద్ద లాభం. ఇక నిఫ్టీ 94.10 పాయింట్లు ఎగబాకి 9,615 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, ఆటో స్టాకులు ర్యాలీ తీశాయి. చిన్న, పెద్దా అన్ని షేర్లకు డిమాండ్ నెలకొంది. పన్ను మీద పన్ను విధానానికి తెరదించుతూ ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ చట్టంతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టనుందన్న ఆశలు మార్కెట్లో సానుకూలతను పెంచాయి. జీఎస్టీ అమలు రేటింగ్‌కు సానుకూలం కానుందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొనడం, ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలందడం కూడా ఈక్విటీ ట్రేడింగ్‌కు కలిసివచ్చింది. ప్రధాన షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లకే డిమాండ్ అధికంగా కన్పించింది. దీంతో బీఎస్ఈలోని మిడ్‌క్యాప్ సూచీ 1.13 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం ఎగబాకాయి.
ఎఫ్ఎంసీజీ, సిగరెట్ల తయారీ దిగ్గజం ఐటీసీ 5.70 శాతం లాభపడి సెన్సెక్స్ టాప్గైనర్గా నిలిచింది. హీరోమోటోకార్ప్ 2.17 శాతం, మారుతి సుజుకీ 1.96 శాతం, కోల్ ఇండియా 1.95 శాతం, ఇన్ఫోసిస్ 1.68 శాతం, అదానీ పోర్ట్స్ 1.55 శాతం పెరిగాయి. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, టాటా మోటార్ స్టాకులు సైతం ఒక శాతానికిపైగా బలపడ్డాయి. ఎన్టీపీసీ షేర్లు మాత్రం 1.17 శాతం నష్టపోయింది. కొటక్ బ్యాంక్, సిప్లా, సన్‌ఫార్మా, లుపిన్ సంస్థలు అరశాతంపైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. రంగాలవారీగా చూస్తే.. బీఎస్ఈలోని ఎఫ్ఎంసీజీ సూచీ 3.40 శాతం ఎగబాకగా.. టెలికం, మెటల్, రియల్టీ, ఆటో ఇండెక్స్‌లు ఒక శాతంపైగా పెరిగాయి.
నేడు జీటీపీఎల్ హ్యాత్వే లిస్టింగ్
ఈమధ్యే పబ్లిక్ ఆఫరింగ్‌కు(ఐపీవో) వచ్చిన ప్రముఖ కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ జీటీపీఎల్ హ్యాత్వే.. మంగళవారం స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్ట్ కాబోతున్నది. గతనెల 21-23 తేదీల్లో ఐపీవోకు వచ్చిన సంస్థ మార్కెట్ నుంచి రూ.485 కోట్లు సేకరించగలిగింది.
4 లక్షల కోట్ల క్లబ్‌లోకి ఐటీసీ
జీఎస్టీ అమలుతో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గడంతోపాటు సిగరెట్లపైనా పన్ను పోటు గతంలో కంటే 5-6 శాతం తక్కువగా ఉండటం ఐటీసీకీ బాగా కలిసివచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో సోమవారం ఇంట్రాడేలో కంపెనీ షేరు ధర ఏకంగా 9.62 శాతం ఎగబాకి రూ.354.80 వద్ద సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. చివర్లో 5.92 శాతం లాభంతో రూ.342.80 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ట్రేడింగ్ విషయానికొస్తే.. ఒక దశలో రూ.353.20 వద్దకు చేరుకున్న సంస్థ షేరు ధర చివర్లో రూ.342.30 వద్ద ముగిసింది. దాంతో ఐటీసీ మార్కెట్ విలువ రూ.4.15 లక్షల కోట్లకు పెరిగింది. నాలుగు లక్షల కోట్ల మైలురాయికి చేరుకోవడం సంస్థకిదే తొలిసారి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత రూ.4 లక్షల కోట్ల క్లబ్‌లోకి చేరిన నాలుగో సంస్థ ఐటీసీ.


