సింహలేశుని గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
- 12 Views
- admin
- July 7, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గం…మొత్తం 32 కిలోమీటర్లు…
సింహగిరుల చుట్టూ ప్రదక్షిణానికి కనీసం సమయం: 10 నుంచి 12 గంటలు.
గరిష్ట సమయం : 15 నుంచి 16 గంటలు.
సింహాచలం: సింహచలేశునికి భక్తులు గిరి ప్రదక్షిణ ద్వారా తమ మొక్కును చెల్లించుకునేందుకు రంగం సిద్దమైంది. ఏటా ఆషాడ శుద్ద చతుర్ధశి నాడు 32 కిలోమీటర్ల దూరం సింహగిరులు చుట్టిరావడం ద్వారా తమ గిరి ప్రదక్షిణను భక్తులు పూర్తిచేసుకుంటారు. భక్తుల కోలాహలంగా పాల్గోనే ఈ ఉత్సవం కోసం విశాఖలో ప్రధాన రహదార్లపై ట్రాఫిక్ మళ్లిస్తారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గోంటారని అంచనా. ఆధ్యాత్మికం, ప్రకృతి పరిశీలన వంటి అంశాల మేళవింపుతో సముద్ర తీరం మీదుగా సాగే ఈ ప్రదక్షిణ వీరిలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.
ఆషాఢ శుద్ద చతుర్ధశి నాడు ఏటా సింహాచలంలో గిరిప్రదక్షిణ అనవాయితీగా వస్తోంది. గత రెండు మూడేళ్లుగా గిరి ప్రదక్షిణకు గణనీయంగా భక్తులు పెరగడంతో అధికార యంత్రాంగం, స్వచ్చంద సంస్ధలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామికి గిరి ప్రదక్షిణ ఒక భూ ప్రదక్షిణతో సమానమని భక్తుల నమ్మకం. భక్తితో పాటు ప్రకృతిని అస్వాదించే విధంగా అటు కొండలు, ఇటు సముద్ర తీరాన్ని సృశిస్తూ సాగే ప్రదక్షిణ ఇది.
స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రచారరధంలో అధిష్టింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించి గిరి తిరిగే 32 కిలోమీటర్లు రధయాత్ర నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు అనువంశిక ధర్మకర్త కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు, తొలి పావంచా వద్ద ప్రచార రధంలో ఉన్నస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనితో గిరిప్రదక్షిణ లాంఛనంగా ఆరంభమవుతుంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.


