అంపశయ్యపై తెలుగుదేశం! కమిటీ ‘చికిత్స’ కలిసొచ్చేనా!!
- 10 Views
- admin
- July 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా: ఆలస్యంగానైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు మేల్కొన్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిపై దృష్టిసారించారు. ఇంట గెలిచి రచ్చగెలవాలి. రాజకీయాలలో ఇది ప్రధానమైనది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండి, కేంద్రమంత్రిగా వ్యవహరిస్తోన్న సాక్షాత్తు పి. అశోక్‌గజపతిరాజు స్వంత నియోజకవర్గమైన విజయనగరంలోనే ‘అధికారపక్షం’ గాడి తప్పింది. నియోజకవర్గం పరిధిలో విజయనగరం పురపాలక సంఘం అత్యంత కీలకమైనది. పురపాలన ఏనాడో గాడి తప్పింది. ఇదేమి కొత్త విషయం కాదు. ప్రజలందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకే పురపాలక అధికార పగ్గాలు అందించారు. కాని దానిని తెలుగుదేశం పార్టీ నేతలు నిలుపుకోలేకపోయారు.
ఉన్నట్టా.. లేనట్టా..!?
విజయనగరం పురపాలక సంఘం ఉన్నాలేనట్లే. ఈ విషయం తెలుగుతమ్ముళే బాహాటంగా అంటుంటారు. రోమ్‌నగరం తగలబడిపోతుంటే చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ ఎంజాయ్ చేసిన చందంగా పట్టణ ప్రజలు సమస్యల ఊబిలో కూరుకుపోతుంటే పాలకవర్గం నిమ్మకునీరెట్టినట్టుగానే వ్యవహరిస్తోంది. అన్నింటికి మించి పాలకవర్గం అధినేత ‘నేనింతే’ అన్నట్లు వ్యవహరించడం విశేషం. మూడేళ్లలో అభివృద్ధి సంగతి దేముడెరుగు… అసలు జరగాల్సిన ప్రాథమిక పనులే జరగడం లేదు. అన్నీ ఉన్నా అల్లునినోట్లో శని చందంగా తయారయ్యింది. విజయనగరం పరిస్థితి. పాలకవర్గం ఉంది. యంత్రాంగం ఉంది, నిధులున్నాయి. కానీ ఏ ఒక్క పనీ జరగదు అదంతే… చివరికి చైర్మన్ పనితరుపై స్వపక్షంలోనే విపక్షం ఏర్పడింది. మున్సిపల్ సమావేశాలలో అధికారపక్ష కౌన్సిలర్లే చైర్మన్ పనితీరుని బహిరంగంగానే కడిగిపారేసారు. సమావేశాల తీరునే ప్రశ్నించారు. పురపాలక వేదికగా తెలుగుతమ్ముళ్ల మద్య అభిప్రాయభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గస్థాయిలో పార్టీ శ్రేణులని కలుపుకుని వెళ్లేనాధుడు కరువయ్యాడు. పార్టీలోని ముఖ్య విభాగాల మధ్య అగాధమే ఏర్పడింది. పురపాలక సంఘం పరిధిలో 40 వార్డులుంటే అందులో 32 వార్డులు తెలుగుదేశానివే. మరోవైపు విజయనగరం కూడా తెలుగుదేశం పార్టీదే. అన్నింటికీమించి ఎమ్మెల్యే స్థానం, చివరికి పార్లమెంటు స్థానం కూడా తెలుగుదేశానిదే. అన్నీ ఉన్నా అల్లునినోట్లో శని చందంగా తయారైంది ఆపార్టీ పరిస్థితి. నియోజకవర్గస్థాయిలో సరిదిద్దుకోలేని ఆ పార్టీనేతలు జిల్లా పరిస్థితిపైజేం దృష్టిసారించగలరన్న అపప్రదను నెత్తికెత్తుకున్నారు. పురపాలక సంఘంలో విపక్షమే లేదు. ఉన్న ఒకరిద్దరు బలగం లేని వాళ్లే. ఇంతలా అవకాశం ఉన్నా పట్టణం పరిధిలో జరిగిన అభివృద్ధి శూన్యమే. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణకు, ఎమ్మెల్యే మీసాలగీతకు అలాగే వీరిద్దరికి పార్టీ పట్టణ శాఖ నాయకత్వానికి అసలు పొసగదు. వీరిరువురు ఎవరికి వారు వ్యక్తిగతంగా వార్డు పర్యటనకు వెళుతూ తమ తమ వర్గ బలాన్ని ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఎవరికి ఎవరు యమునాతీరే చందంగా ఎవరికి వారు వ్యవహరిస్తుండటంతో మధ్యలో తెలుగుతమ్ముళ్లు అంతర్మధనంలో పడ్డారు. నియోజకవర్గ కేడర్ ఒక్కసారిగా డీలాపడింది. పట్టించుకునే నాధుడులేక పరిపరివిధాల నలిగిపోతున్నారు. పార్టీ కార్యాలయమైన అశోక్‌బంగ్లా చుట్టూ కోడి ప్రదక్షణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
కమిటీ పాలన…!
నియోజకవర్గ ప్రజలు నమ్మి అన్నిస్థానాల్లో, స్థాయిలో పార్టీకి పట్టంకడితే తగుదునమ్మా అంటూ తెలుగుదేశం నేతలు ఈ మూడేళ్లలో పార్టీని భ్రష్టుపట్టించేసారు. ఇటీవల జరిగిన పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. దరిమిలా పార్టీ పెద్దలు పిలిచి క్లాసు తీసుకున్న పాలక ప్రతినిధుల్లో మార్పురాలేదు. రానున్నది ఎన్నికల కాలం. ఇదే రీతిన ఉంటే పార్టీ ఎడ్రస్ గల్లంతవడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించిన అశోక్‌బంగ్లా పెద్దలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఆరుగురితో కూడిన కమిటీని వేసి పాలనాపరిశీలనా బాధ్యతలను అప్పగించారు. అందులో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్ చైర్మన్ కనకల మురళీ మోహన్‌ను సభ్యులుగా వేసినప్పటికీ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, ఎస్.ఎన్.ఎం.రాజు పార్టీ సంబంధిత వ్యక్తులు ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పుట్టి మునిగిన ఈ పరిస్థితులలో దిద్దుబాటు చర్యలు చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడమేనంటూ సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే అశోక్ బంగ్లాలోని చెట్ల నీడన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్లు గాలికొదిలేసి ఇపుడు ప్రక్షాళకు యత్నించడం కంటితుడుపు చర్యగానే ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పాలకవర్గం పుణ్యమా అని నియోజకవర్గం పరిధిలో తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని అశోక్ బంగ్లా చెట్ల కింద తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అసలు ఇప్పటికే చాలా మంది విజయనగరం పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని తలచుకోడానికే భయపడిపోతున్నారు. కొంతమంది తెలుగు తమ్ముళ్లయితే చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తమ పార్టీ కాదన్నట్లే చెప్పుకొస్తున్నారు. పురపాలనలో ప్రసాదుల రూటే సెపరేటని, అశోక్ బంగ్లాకి ఇంకా మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వాదించడానికి కూడా సదరు తెలుగు తమ్ముళ్లు వెనుకాడటం లేదు.
కమిటీతో కాలయాపన…
నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఎవరో అశోక్ బంగ్లాలో ఏ చెట్టు ఆకుని అడిగినా ఇట్టే చెప్పేస్తుంది. అటువంటిది పార్టీ నేతలకి తెలియదా అంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు తమకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర తెగ బాధపడిపోతున్నారు. ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోకుండా కమిటీ వేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. కమిటీ కాలయాపనకే గానీ ఒరిగేదేమి లేదని ఇంత జరిగినా ఇంకా మారని పార్టీ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పుట్టి పూర్తిగా మునిగిన నేపధ్యంలో ఏర్పాటైన పార్టీ కమిటీ చేసే కాయకల్ప చికిత్స ఏ పాటితో ఎదురు చూడక తప్పదు.


