అదితీ గజపతిరాజు ఆరంగేట్రం
- 8 Views
- admin
- July 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం
విజయనగరం సంస్థానాదీశుల ముద్దుబిడ్డ, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితీ గజపతిరాజు రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆదివారం పట్టణంలో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఈ విషయం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుండి తండ్రి అశోక్ గజపతిరాజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారానికి మాత్రమే పరిమితమైన ఆమె క్రియాశీలక రాజకీయాల పట్ల మొగ్గుచూపుతున్నారు. ఈ విషయంలో ఆమె తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆమె తండ్రి అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నారు. తాతయ్య డాక్టర్ పి.వి.జి.రాజు 1952-1953 ఎన్నికల్లో సోషలిస్టు, ప్రధాన సోషలిస్టు పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆమె నాన్నమ్మ కుసుమ గజపతిరాజు 1953లో గజపతినగరం నియోజకవర్గం నుండి ప్రజా సోషలిస్టు పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తల్లి సునీలా గజపతిరాజు విజయనగరం మున్సిపాల్టీకి మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా పనిచేశారు. పెదనాన్న ఆనంద గజపతిరాజు శాసనసభ, లోక్‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కేబినేట్లో ఆయన విద్యా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారి బాటలోనే అదితీ గజపతిరాజు కూడా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. గత కొంతకాలంగా ఆమె రాజకీయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్న ద్వారపూడి, సారిపల్లి గ్రామాలపై దృష్టిసారించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అశోక్ మరోసారి లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేయనున్నారు. అందువల్ల ఆయన వారసురాలుగా అదితీ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. లేనిపక్షంలో విజయనగరం మున్సిపాల్టీ త్వరలోనే కార్పోరేషన్‌గా ఏర్పడనుంది. అందువల్ల కార్పోరేషన్ మేయర్‌గా ఆమె అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలించే అవకాశాలున్నాయి. మొత్తం మీద అశోక్ వారసురాలుగా ఆమె రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖాయమైనట్లే చెప్పుకోవచ్చు.


