ఈ విషయాన్ని మొదట చైనా ఎంబసీయే ట్వీట్ చేసినా.. తర్వాత డిలీట్ చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం మొదట ఇదో ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. చైనా రాయబారిని రాహుల్ కలిశారంటూ కొన్ని న్యూస్ చానెల్స్ ఫేక్ న్యూస్‌ను నడిపిస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. మోదీ భక్తునిగా మారాలనుకుంటున్న ఓ చానెల్ ముగ్గురు కేంద్ర మంత్రుల చైనా పర్యటనను, జీ20లో చైనా అధ్యక్షుడితో స్నేహంగా ఉన్న ప్రధానిని ప్రశ్నించకుండా ఫేక్ న్యూస్ నడిపిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: నిజమే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చైనా రాయబారి లూ ఝావోహుయ్ని కలిశారు. మొదట ఈ వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీయే.. ఈ వార్తను ధృవీకరించింది. ఈ సమావేశానికి అంత ప్రముఖంగా చూడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అంటున్నది. అయితే ఈ ఇద్దరూ ఎందుకు కలిశారన్నది మాత్రం ఆ పార్టీ చెప్పలేదు. అంతేకాదు మొదట ఎందుకు ఖండించాల్సి వచ్చింది, దీనిని ఓ ఫేక్ న్యూస్‌గా ఎందుకు చిత్రీకరించారన్నది కూడా కాంగ్రెస్ వెల్లడించలేదు. ఈ వార్తను మొదట ఖండించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలానే ఈ వార్తను ధృవీకరించడం గమనార్హం. శనివారం ఉదయం 8.30 గంటలకు రాహుల్.. చైనా రాయబారిని కలిసి ప్రస్తుత ఇండియా, చైనా సంబంధాలపై చర్చించినట్లు కాంగ్రెస్ తెలిపింది. చైనా రాయబారే కాదు.. భూటాన్ రాయబారి కూడా రాహుల్‌ను కలిశారని చెప్పింది.
అయితే కొద్ది గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీళ్ల సమావేశాన్ని సెన్సేషనలైజ్ చేయాల్సిన అవసరం లేదని, దేశాల రాయబారులు కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను కలుస్తూనే ఉంటారని ఇప్పుడు చెబుతున్నది. మరి ఇదే విషయాన్ని ముందు ఎందుకు అంగీకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.