చెన్నై తీరంలో అమెరికా, జపాన్ నౌకలు
- 42 Views
- admin
- July 10, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
చెన్నై: బంగాళాఖాతంలో మలబార్ నౌకాదళ విన్యాసాలు మొదలయ్యాయి. భారత్, జపాన్, అమెరికా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. మూడు దేశాల మధ్య బలమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిట్జ్, యూఎస్ఎస్ ప్రిన్స్టన్, యూఎస్ఎస్ హోవర్డ్, యూఎస్ఎస్ షౌప్, యూఎస్ఎస్ కిడ్, పోసిడాన్ సబ్మెరైన్లు నౌకా విన్యాసాలకు వచ్చాయి. జపాన్‌కు చెందిన 27 వేల టన్నుల జూమో యుద్ధ నౌకతో పాటు డెస్ట్రాయర్ జేఎస్ సాజనామీ మలాబార్ ఫ్లీట్‌లో పాల్గొంటున్నాయి. భారత్‌కు చెందిన జెల్సావా, 45 వేల టన్నుల బరువున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యలు కూడా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కమోర్టా క్లాస్‌కు చెందిన రెండు సబ్మెరైన్లు కూడా ఈవెంట్‌కు వస్తున్నట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి. షివాలిక్ క్లాస్ ఫ్రిగేట్లతో పాటు కోరా డెస్ట్రాయర్లు, ఐఎన్ఎస్ జ్యోతి ట్యాంకర్ కూడా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
21వ సారి ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. కెరీర్ స్ట్రయిక్ ఆపరేషన్స్, మారీటైమ్ పాట్రోల్, రికనసైన్స్ ఆపరేషన్స్ లాంటి అంశాల్లో మూడు దేశాలు తమ అనుభవాలను పంచుకుంటాయి. ఇక్కడే సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్లు విన్యాసాలు కూడా చేస్తాయి. మెడికల్ ఆపరేషన్స్, డామేజ్ కంట్రోల్, ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్, హెలికాప్టర్ ఆపరేషన్స్ లాంటి అత్యవసర విభాగాల పనులను కూడా పరిశీలిస్తారు. సాధారణంగా అమెరికా, భారత్ దేశాలు మలబార్ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తాయి. అయితే ఈ సారి జపాన్ కూడా శాశ్వత సభ్యదేశంగా నమోదు అయ్యింది. అబ్జర్వర్‌గా ఆస్ట్రేలియా ఆసక్తి చూపినా ఆ దేశానికి అవకాశం ఇవ్వలేదు. ఇండో-ఏసియా-పసిఫిక్ తీరాల్లో సముద్ర భద్రత పట్ల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో మలబార్ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


