బంగారు భవితకు భద్రత భవిష్యనిధి
- 9 Views
- admin
- July 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
-సొంత ఇంటి కలలకు సాకారం -ఉద్యోగులు, కార్మికుల నమోదు ఖచ్చితం, సులువుతరం
-‘నిధి ఆప్ కే నికట్’తో సమస్యల పరిష్కారం
-ఫీచర్స్ ఇండియా ప్రతినిధితో రీజనల్ పిఎఫ్ కమిషనర్ తిరుమలరాజు ఇందిర
దేశ భవిష్యత్తు ఉద్యోగులు, కార్మికులు. వారు సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుంది. మనకు స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక సమానత్వం, సమగ్ర సంక్షేమానికి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు సాధికారత సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం, సంపూర్ణ సహకారం అందించేందుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్వదా కృషి చేస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా పిఎఫ్ సంయుక్త సంచాలకులు ఇందిర తిరుమల రాజు ఫీచర్స్ ఇండియాతో ముఖాముఖిలో ఉద్యోగుల సంక్షేమం గురించి పలు విషయాలను విశదీకరించారు.
ఉద్యోగస్తుల కుటుంబాలు సాధికారత సాధించేందుకు పెన్షన్ స్కీము, పెన్షన్ పిఎఫ్, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం విధానాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని ఆమె అన్నారు. ప్రతి ఉద్యోగికీ భవిష్యనిధి స్కీము వర్తించాలంటే విధిగా రూ.15వేలతో సభ్యునిగా ఉండాలన్నారు. పిఎఫ్ సంస్థ ప్రతి వ్యక్తికీ యుఏఎన్ (యూనివర్శల్ అకౌంట్ నెంబరు)తో జీవిత కాలపు జమలు నమోదవుతాయి. దీనికి సంబంధించిన ఖాతా వివరాలను ఉద్యోగి ఆన్లైన్లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఉద్యోగి ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే భార్య, కుటుంబ సభ్యులు, నామినీలకు భవిష్యనిధి అందజేస్తారన్నారు. యుఎఎన్ నెంబరు ప్రాముఖ్యతను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు జమ వివరాలను పరిశీలించుకోవచ్చన్నారు.
ఇటీవల ప్రవేశంలోకి వచ్చిన ‘నిధి ఆప్కే నికట్’ ద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిఎఫ్ అధికారుల సమక్షంలో సత్వరమే తమ సమస్యల పరిష్కారాలకు మార్గాలు సులభతరం అవుతాయన్నారు. ప్రతి వ్యక్తి పెన్షన్‌కు అర్హులుగా పదేళ్ల సర్వీసు ఉండాలి. అయితే మరణించిన వారికి సర్వీసుతో అవసరం లేదన్నారు. నేడు సమగ్ర సమాచారం ఉద్యోగులకు పిఎఫ్ కార్యాలయాలకు మధ్య సులువుగా ఒకే ఫారంను ఉపయోగించి అంతా ఆన్లైన్లో సులభతరం అవుతున్నాయన్నారు.
ప్రతి ఉద్యోగి తనకు కావలసిన శాశ్వత ఇంటికోసం ఓ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకొని పదిమంది సభ్యులతో కూడి, లేదా వ్యక్తిగతంగా పిఎఫ్ సంస్థ ధ్రువపత్రం పొంది సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చని సంయుక్త్త సంచాలకులు ఇందిర తెలిపారు.
ఉద్యోగి పిఎఫ్ సంస్థ నుండి సత్వర సర్వీసులు పొందేందుకు ‘ఓఎల్ఆర్ఇ’లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. తమ సంస్థ ప్రతినిధులు, సదస్సులు, సమావేశాలు, కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన వ్యక్తులకు అవగాహన చేస్తున్నట్లు తెలిపారు. అమ్నెస్టీ స్కీము ద్వారా కోటి రూపాయల వరకు పింఛన్లు పొందారని, ఉద్యోగులు, కార్మికులు తమ సమాచారం కోసం దగ్గరలోని పిఎప్ సంస్థను, జరుగుతున్న నూతన వరవడుల గురించి పూర్తి అవగాహన పొంది సత్ఫలితాలను పొందాల్సి ఉందని తెలిపారు.
వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఇళ్లు, వివాహం, చదువు, వివాహాలకు, ఆరోగ్య సంరక్షణకు కొంత మేర సొమ్మును పొందవచ్చు. పదేళ్ల సర్వీసు నిండిన వారు పింఛన్ స్కీముకు అర్హులౌతారు. పిఎఫ్ నిధిని జమపరుస్తున్న కార్మికులు, ఉద్యోగులు స్కీములో ఉన్న పదిహేను వేల జీతం కలిగి ఉన్న వ్యక్తులు మరణిస్తే ఆరు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కుటుంబ సభ్యులకు మంజూరు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ఉపకారార్థం పిఎఫ్ ఫండ్ దరఖాస్తులను సులువుతరం చేసినట్లు ఇందిర తెలిపారు. పదవీ విరమణ లేదా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు అనారోగ్యాలు, చదువు, వివాహం, ఇల్లు, ఆర్థిక సహాయం పొందేందుకు ఒకే ఫారములో ఎఫ్ 19, 10సి-31 టిక్ చేసి దరఖాస్తు చేసుకుంటే వారి మార్గం సులువుగా ఉంటుందన్నారు. దరఖాస్తుతో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు జత చేయనవసం లేదన్నారు. ఉద్యోగి సర్వీసులో ఉండి చనిపోతే ఒకే ఫారం-ఎఫ్20, 10డి-5ఐఎఫ్ను ఉపయోగిస్తే చాలన్నారు.
ప్రతి ఉద్యోగి కేవైసీ, యుఎఎన్ నెంబరుతో ఆధార్ నెంబరును అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ విధానం వల్ల ఆన్లైన్లో తమ వివరాలను పరిశీలించు కోవచ్చన్నారు. యుఎఎన్, ఆధార్, బ్యాంకు ఖాతా నెంబర్లకు అనుసంధానం తప్పనిసరి చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ఇది సులువైన పని అన్నారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం ద్వారా ప్రతి ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు 2.20 లక్షల రూపాయలు సబ్సిడీ సౌకర్యం ఉందన్నారు. ఇపిఎఫ్ హౌసింగ్ స్కీము ద్వారా 2022 ఏడాది నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తి ఒకసారికి మాత్రమే అర్హుడౌతాడన్నారు. భవిష్యనిధి పెన్షన్ స్కీము పిల్లలకు 250, అర్బన్స్కు 750, వితంతువులకు వెయ్యి రూపాయలు అమలు జరుగుతుందన్నారు. ఎస్టాబ్లిష్మెంట్స్ 10వేల 681 ఉన్నాయన్నారు. ఖాతాలు 14 లక్షల 54 వేల 957 ఉండగా చందాదారులు 8 లక్షల 15 వేల 649 ఉన్నారని తెలిపారు. ఆధార్ సీడింగ్ మూడు నెలలు జరుగుతుంది, అనుసంధానం తప్పనిసరి దీనివల్ల లబ్ధి అవకాశాలు ఎక్కువని అన్నారు.
అలాగే జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్టిఫికెట్లు) నవంబర్, డిసెంబరు నెలల్లో సంబంధిత కేంద్రాలలో అందజేయాలన్నారు. ఆధార్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత కంపెనీ, సంస్థ తరఫు నుండి జాయింట్ ధ్రువపత్రాలు పిఎఫ్ ఆఫీసుకు అందజేయాలని ఆమె పేర్కొన్నారు.
ఉద్యోగులకు దగ్గరలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కార్యాయలయాల్లో నిధి ఆప్కే నికట్ ప్రతి నెల 10వ తేదీన జరుగుతుందని, ఇందులో సమస్యలు పరిష్కారం జరుగుతాయన్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజుకే సంబంధిత పింఛను ఆదేశ పత్రాలు సిద్ధంగా ఉంటాయని, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పిఎఫ్ సంబంధిత సమస్యలపై పిఎఫ్ ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు.
కంపెనీ లేదా సంస్థల్లో పిఎఫ్ అమలు కావాలంటే కనీసం 20 మంది ఉద్యోగులు ఉండి, ఇసిఆర్లో రిజిస్టర్ కావాల్సి వుందన్నారు. భవిష్యనిధి సభ్యుల కలలను సాకారం చేసేందుకు అవసరమైన, సహాయ సహకారాలు పిఎఫ్ ప్రతినిధులు అందిస్తారన్నారు.
భవిష్యనిధితో భారతీయ స్టేట్ బ్యాంకుతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులద్వారా ఉద్యోగులకు అనువైన సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించు కోవాలని ఇపిఎఫ్ సంయుక్త సంచాలకులు ఇందిర తిరుమలరాజు తెలిపారు.


