వుడా భూ ఆక్రమణలపై నివేదికకు రంగం సిద్ధం
- 11 Views
- admin
- July 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
-పూర్తి కావస్తున్న సర్వే -ఆక్రమణల దారులపై త్వరలో చర్యలు -4,167 ఎకరాల కబ్జా
విశాఖపట్నం, ఫీచర్స్ఇండియా: నగరంలో జరిగిన వుడా భూ ఆక్రమణలకు సంబంధించి త్వరలోనే నివేదిక సిద్ధం చేయనున్నారు. కొంతకాలంగా జరుగుతున్న సర్వే త్వరలోనే పూర్తి కాననుంది. అనంతరం వుడా ఎస్టేట్ సెల్ అధికారులు సమగ్ర వివరణలతో నివేదిక రూపొందించి వైస్ చైర్మన్ బసంత్‌కుమార్‌కు అందజేస్తారు. అనంతరం వుడా అధికారులు ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు చేపట్టనున్నారని సమాచారం.
వుడాకి రెవెన్యూశాఖ ఇచ్చిన భూములలో కొన్ని భూములనే చట్టబద్దంగా అప్పగించడంతో మిగిలిన భూములలో ప్రతిష్టంభన నెలకొంది. వుడాకి గతంలో రెవెన్యూశాఖ దఫదఫాలుగా 11,742 ఎకరాలు అప్పగించారు. దీనితో వుడా వేలం పాటల ద్వారా పలు భూములను విక్రయించింది. కాని, రాష్ట్రస్థాయి ఎలిమినేషన్ కమిటీ ఆమోదంతో వుడాకి 1431 ఎకరాలను మాత్రమే అప్పగించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
మిగిలిన భూములకు సంబంధించి రెవెన్యూ ఉద్యోగులు రికార్డులు తారుమారు చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేశారని ఆరోపణలో రావడంతో వుడా అధికారులు కొంతకాలంగా సర్వే నిర్వహిస్తున్నారు. వుడాకి ఇచ్చేసిన భూములనే ఇప్పుడు రెవెన్యూశాఖ తగుదునమ్మా అంటూ ఇతర అవసరాలకు కేటాయించడం వుడాకి మింగుడు పడడం లేదు. వుడా ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2246 ఎకరాలు సేకరించారు. ఇక 4,167 ఎకరాలలో ఆక్రమణలు, న్యాయపరమైన చిక్కులు నెలకొన్నాయి. ఈ భూ వివాదాలకు సంబంధించి 260 కేసులు నడుస్తున్నాయి. మధురవాడలో వుడాకి రెవెన్యూ భూమి అప్పగించారు. ఇందులో 3వేల గజాలను వేలంలో ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ఇందులో 500 గజాలలో ఆక్రమణలు చోటుచేసుకోవడంతో యజమాని కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వుడా అధికారులు ఫిర్యాదు చేసినా సరే రెవెన్యూశాఖ పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
చురుగ్గా సర్వే…
వుడా భూములకు సంబంధించి సర్వే పూర్తి కావస్తుంది.. వుడా ఆధ్వర్యంలో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఏయే భూముల్లో ఆక్రమణలు వున్నాయో నిర్ధారించేందుకుగాను వుడా వైస్‌చైర్మన్ బసంత్‌కుమార్ ఆదేశాలు మేరకు సర్వే ,ఉరుగ్గా సాగుతుంది.. దీనితో వుడా ఎస్టేట్ ఆఫీసర్ వసంతరాయుడు పర్యవేక్షణలో ఒక ఏపీఓ, ఏఈ , ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మేన్, సర్వేయర్, చైన్మేన్, ఉప తహశీల్దార్లు వున్నారు. వీరు ముందుగా మండల తహశీల్దార్కార్యాలయాలకు వెల్లి వుడాకి అప్పగించిన భూమి రికార్డులను, రెవెన్యూశాఖ రికార్డులతో పోల్చిచూస్తారు. వుడా భూములకు హద్దులు నిర్ణయించి, ఆక్రమణదారులుంటే ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తారు. ఎలిమినేషన్ ప్రక్రియ కోసం వుడా నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది.


