అంతుపట్టని పవన్ అంతరంగం
- 15 Views
- admin
- July 11, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
– ప్రత్యార్ధులకు అర్థంకాని రాజకీయ చతురత – చాపకింద నీరులా కార్యకర్తల ఎంపిక
– సంస్థాగత నిర్మాణంపై పవన్ దృష్టి – సమస్యలపై పోరాడేవారికే పెద్దపీట
– భవిష్యత్ కార్యాచరణపై సందిగ్ధత
(విశాఖపట్నం-ఫీచర్స్ ఇండియా)
పవన్‌కళ్యాణ్… తెలుగు నాట ఈ పేరు అత్యంత శక్తివంతమైనది. సమస్యను స్పష్టంగా చెప్పగలిగే ఎకైక నాయకునిగా, ముక్కుసూటి మనిషిగా, నిజాయితీకి మారుపేరుగా, ఎంతటివారినైనా ప్రశ్నించే శక్తిగా పేరుగాంచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమీ విజయానికి కృషిచేసిన పవన్ కొద్దిగా రోజులుగా మౌనంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించి నేటకీ పార్టీని పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం చేయలేదు. మరోపక్క అధికార, ప్రతిపక్ష పార్టీలు 2019 ఎన్నికలకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. అయినా పవన్ మాత్రం ఇంకా చాలా సమయం ఉందని ఆలోచిస్తున్నారా… లేక చాపకిందనీరులా తమ పని చేసుకుపోతున్నారా… అనేది ప్రత్యార్ధి పార్టీలకు అంతుబట్టడం లేదు. అయితే సమస్యలపై పోరాడేవారికే తమ పార్టీలో పెద్దపీట వేస్తామని పవన్ ఇదివరుకే తెలిపారు. ఈ నేపథ్యంలో స్కిప్ట్ రైటర్స్, స్పీకర్స్, కార్యకర్తలు ఇలా పలు విభాగాలకు నాయకులను రాత పరీక్షలు పెట్టి ఎంపికచేస్తున్నారు. ఈ పక్రియ దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి. అయితే తదుపరి కార్యాచరణను మాత్రం పవన్ నేటికీ బయటపెట్టలేదు. దీనిపై పవన్ అభిమానులతోపాటు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ, వైసీపీ 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతుంటే, పోటీసిద్ధమని ప్రకటించిన పవన్‌కళ్యాణ్ తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో పవన్ మౌనంగా ఉండటం వెనుక కారణాలేంటన్న అంశాలపై ఫీచర్స్ ఇండియా ప్రత్యేక కథనం…
పవర్ కోసం కాదు… ప్రశ్నించడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనకు కట్టుబడి అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తూ వచ్చారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలు, ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, చేనేతను కాపాడాలని, బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలు అమలు చేయాలని తదితర సమస్యలను పవన్‌కళ్యాణ్ పెద్దఎత్తున ప్రశ్నించారు. కొన్ని సమస్యలపై పెద్దఎత్తున పోరాటాలు కూడా చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులను, రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతుల వద్దకు ఆయన వెళ్లి వారిని కలసి వారి కష్టాలను తెలుసుకున్నారు. చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండకూడదని తలంచి చేనేతకు బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్నారు. దీంతో ప్రజల్లో విపరీతమైన అభిమానం సంపాదించుకున్నారు. మిగతా రాజకీయ నాయకులు కంటే పవన్‌కళ్యాణ్ భిన్నమైన వ్యక్తిగా, జనసేన భిన్నమైన పార్టీగా ప్రజలు భావించారు.
ఇటీవల ‘ఒక దేశం – ఒకే దఫా ఎన్నికలు’ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2018లోనే ఎన్నికలు వస్తాయని రాజకీయ మేధావులు భావించారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించి ప్రజలతోపాటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుంది? ఆ నియోజకవర్గాల బాధ్యులు, జిల్లా కమిటీలు ఏర్పాటు తదితర విషయాలపై నేటికీ పవన్ స్పష్టత ఇవ్వడం లేదు. మరోపక్క అధికార, ప్రతిపక్ష పార్టీలు 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ ఇటీవల విశాఖపట్నంలో ‘మహానాడు’ ఏర్పాటుచేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. వైసీపీ కూడా గుంటూరులో ప్లీనరీ ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశనిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల ఎజెండాను కూడా దాదాపుగా ప్రకటించేశారు. దీంతోపాటు రెండు వేల కిలోమీటర్ల మేర సుమారు ఆరు నెలలపాటు పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత జగన్ తమ తదుపరి ప్రణాళికను కూడా ప్రకటించారు. దీంతో ఆయా పార్టీల కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ రెండు పార్టీలకూ సంస్థాగతంగా బలమైన క్యాడర్ ఉండటంతో వారు ఎన్నికలకు దాదాపుగా సిద్ధంగా ఉన్నారు.
అంతుబట్టని పవన్ అంతరంగం
జనసేన పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. సంస్థాగతంగా నిర్మాణం కూడా లేదు. గ్రామ, మండల, జిల్లా కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీని కూడా నేటికీ ఏర్పాటు చేయలేదు. జనసేన పార్టీలో అధికారికంగా పవన్‌కళ్యాణ్ తప్ప మరెవరూ లేరు. అసలు పవన్‌కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీచేస్తారో? లేదో? అన్న విషయంపైనా కూడా పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క పార్టీ నిర్మాణం నేపథ్యంలో తమతో చర్చించని కారణంగా తాము పవన్‌కళ్యాణ్‌కు మద్ధతు ఇవ్వబోమని కాపు సంఘం నాయకులు బహిరంగంగానే నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్ని సమస్యలు ఉన్నా పవన్‌కళ్యాణ్ మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం వెనుక రహాస్యం ఏమిటన్న విషయంపై ఎవరికీ స్పష్టతలేదు.
చాపకింద నీరులా కార్యకర్తల ఎంపిక
అయితే పవన్‌కళ్యాణ్ మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలను ఎంపిక చేస్తున్నారు. వివిధ విభాగాలకు పరీక్షలు నిర్వహించి అర్హత సాధించినవారినే ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తియిందని, తదుపరి కార్యక్రమంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించి జనసేన పార్టీ సిద్ధాంతాన్ని తెలియజేస్తారని కొంతమంది పవన్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీల కార్యకర్తలా కాకుండా సైనికుల్లా ఉండేలా వారికి ఆ శిక్షణా తరగతుల్లో శిక్షణ ఇస్తారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం విశేషం.
పవన్ పాదయాత్ర చేస్తారా?
ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తారని గతంలో జనసేన పార్టీ కార్యకర్తలు భావించారు. అయితే ఇటీవల గుంటూరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో తాను పాదయాత్ర చేస్తానని ఆ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ తన ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కూడా పాదయాత్ర చేస్తే జగన్‌ను కాపీకొట్టినట్టు ఉంటుందని, పాదయాత్రకు ప్రత్యామ్నాయం ఆలోచించే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటారన్న విషయంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అభిమానులు, ప్రజల ఆందోళనను అర్థం చేసుకొని పవన్‌కళ్యాణ్ స్వల్పకాలంలోనే తాము చేయబోయే భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


