పారిశుధ్య కార్మికుల బంద్-ర్యాంకుకు దూరమవుతున్న గ్రేటర్
- 11 Views
- admin
- July 12, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రజారోగ్యశాఖకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 279జీవోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పారిశుధ్య కార్మికులు మంగళవారం ఉదయం నుండి సమ్మెలోకి దిగారు. దీంతో జివిఎంసి పరిధిలోని అన్ని ప్రాంతాలు చెత్త కుప్పలతో, మురుగుతో నిండిన కాలువలతో, దుర్వాసన వెదజల్లుతున్న డబ్బాలతో దర్శనమిస్తున్నాయి. దేశంలోనే ఐదవ ర్యాంకు సంపాదించిన స్మార్ట్‌సిటీ(గ్రేటర్ విశాఖ) నెం.1 ర్యాంకుకు దూరమవుతున్నట్లు అనిపిస్తుంది. పారిశుధ్య పనులకు సంబంధించి ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో నెం.581ను రద్దు చేసి, 279జీవోను తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ఆ జీవోను రద్దు చేయాలని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల నుండి జీవోను అమలు చేస్తూ పారిశుధ్య పనులను బడా కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికి రాష్ట్రంలోని పలు మున్సిపాల్టీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్లకు టెండర్ల ప్రకటించింది. దీంతో జివిఎంసి గుర్తింపు యూనియన్ ఏఐటియుసి, సీఐటీయు, హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి తదితర యూనియన్లు సంయుక్తంగా మూడు రోజలు పాటు సమ్మెకు దిగాయి. మంగళవారం ప్రారంభమైన సమ్మె బుధవారం కూడా కొనసాగింది. అయితే జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, జివిఎంసీలో పనిచేస్తున్న 900మంది శాశ్వత కార్మికులతో అన్ని వార్డుల్లో కొంత మేరకు చెత్త కుప్పలను తొలగించే కార్యిక్రమానికి శ్రీకారం చుట్టారు. జివిఎంసి పరిధిలో పనిచేస్తున్న సుమారు 4,800మంది ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నగరమంతా ఒక్కసారి చెత్త విశాఖగా మారింది. దీంతో ఇళ్లల్లో అలాగే పెద్దపెద్ద బహుళ అంతస్థుల భవనాల్లో ప్రతీరోజూ చెత్తను తీసుకువెళ్లే నాథుడు లేకపోవడంతో చెత్తబాధతో తలలు మొత్తుకుంటున్నారు. గురువారం కూడా సమ్మెకొనసాగడంతో వార్డుల్లో పారిశుధ్యం మరింత క్షీణించే అవకాశాలున్నాయి.


