ఏజెన్సీ గ్రామాల్లో జ్వరాల విజృంభణ.. రెండు రోజుల క్రితం చిన్నారి, గృహిణి మృతి
- 14 Views
- admin
- July 13, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
పాడేరు, ఫీచర్స్ ఇండియా: విశాఖ ఏజెన్సీలోని పలు గ్రామాల్లో జ్వరాలు సోకడంతో గిరిజనులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై కనీసం ఐటిడిఎ పివో గాని వైద్యా ఆరోగ్య శాఖాధికార్లు గాని స్పందించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుకుంపేట మండలం అండిభ పంచాయితీ పరిధిలో గల ఎ.కొత్తూరు అడపాతోట, అండిభ నత్తగురువు, పలు గ్రామాల్లో సుమారుగా 60 మంది గిరిజనులు గత వారం రోజుల నుండి తీవ్ర జ్వరాలతో బాదపడుతున్నారు. రెండు రోజులు క్రితం అండిభ గ్రామంలో ఓ చిన్నారి, గృహిణి పచ్చకామెర్లు, జ్వరంతో వైద్యం అందక మృత్యువాత పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంత తీవ్ర స్థాయిలో అల్లాడుతున్న ఇప్పటికి ఆ గ్రామాలను అధికార్లు సందర్శించిన దాఖలాలు లేవని గిరిజనులు ఆవేదన చెందారు.
ప్రతీ ఏడాది హుకుంపేట మండలంలో ఏదో ఒక చోట నుండి ఎపిడిమిక్ సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది కూడా హుకుంపేట నుండే ప్రారంభమైనట్టు అనిపిస్తుంది. ఇప్పటికే అండిభ పంచాయితీ పరిధి చుట్టుపక్కల గ్రామాల్లో 60 మంది మంచం పట్టారు. ప్రస్తుతం ఎం. రాంభాబు, ఎన్. రాజుబాబు, ఎస్. కేశమ్మ, ఎస్. రామన్న, జి. సింహాచలం, జి. మత్స్యరాజు, జి. నందిని, జి. బాలన్న, రాములమ్మ, చిట్టిబాబు, తీవ్ర జ్వరాలతో బాదపడుతున్నారు. వీరితో పాటు మరో 30 మందికి కూడా అదే పరిస్తితి నెలకొంది. ఈ గ్రామాలన్నీ హుకుంపేట మండల పిహెచ్‌సికి దూరంగానే ఉండటంతో వైద్య సిబ్బంది ఇటువైపే చూడడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఏజెన్సీలో రెండు రోజులు పర్యటించినా ఫలితం లేకపోయింది. ప్రధానంగా ఏజెన్సీ మీద ప్రస్తుతం పివోకి పూర్తి స్దాయిలో అవగాహన లేదు. ఎపిడిమిక్ సీజన్‌పై అధికార్లు ముందస్తు చర్యలు తీసుకోకపోతే గిరిజనులు పిట్టలు రాలినట్టు రాలిపోవడం తప్పదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ గ్రామాల్లో వైద్య సిబ్బంది వెళ్లి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హుకంపేట మండలం అండిభ పంచాయితీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో వెంటనే మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం. శ్రీను, శంకరావు, సుందరావు, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పివో చొరవ తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి జ్వరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


