చిన్నమ్మకు జైలులోనూ రాచమర్యాదలు
- 24 Views
- admin
- July 13, 2017
- జాతీయం తాజా వార్తలు
బెంగుళూరు: చిన్నమ్మ శశికళకు జైలులో రాచమర్యాదలే జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళపై ఆరోపణలు వచ్చాయి. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆమెకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారట. సీనియర్ జైలు అధికారి రూప ఇచ్చిన వేదిక ప్రకారం ఈ విషయం తెలుస్తున్నది. జైలులో ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేసేందుకు ఓ జైలు అధికారికి శశికళ రెండు కోట్లు లంచం ఇచ్చినట్లు కూడా ఆ నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. తనకు వండి పెట్టేందుకు శశికళ జైలులో స్పెషల్ కిచన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హెచ్ఎన్ సత్యనారాయణ రావుకు కూడా ముడుపులు ముట్టినట్లు రూప తయారు చేసిన నివేదికలో వెల్లడైంది. ఇటీవలే జైళ్ల శాఖలో డీఐజీగా రూప బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాతే అగ్రహార జైలులో జరుగుతున్న అక్రమాలపై నివేదిక తయారు చేశారు. స్టాంప్ పేపర్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నట్లు రిపోర్ట్‌లో ఉన్నది. జైలులో ఉన్న 25 మందికి ర్యాండమ్ డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తే, అందులో 18 ఖైదీలు పాజిటివ్‌గా తేలినట్లు నివేదిక వెల్లడించింది.
లంచం తీసుకోలేదన్న డీజీ.. దర్యాప్తు చేపట్టాలన్న డీఐజీ
పరప్పన అగ్రహార జైలులో శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నరని డీఐజీ రూపా చేసిన ఆరోపణలపై కర్నాటక జైళ్ల శాఖ డీజీ స్పందించారు. శశికళకు వీఐపీ సౌకర్యాలు కల్పించేందుకు తాను లంచం తీసుకోలేదని డీజీ సత్యనారాయణ రావు అన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే శశికళకు సహకరిస్తున్నామని ఆయన తెలిపారు. డీఐజీ రూప రాసిన లేఖలో వాస్తవం లేదని, శశికళకు ప్రత్యేక అవసరాలు ఏమీ కల్పించలేదన్నారు. ఒకవేళ డీఐజీ రూప ఏదైనా గమనిస్తే, ఆమె ఆ విషయాన్ని చర్చించవచ్చు అని, ఒకవేళ తనపై ఆరోపణలు ఉన్నా, తాను విచారణకు సిద్ధమే అన్నారు. డీఐజీ రూప కూడా తాను రాసిన లేఖ పట్ల స్పందించారు. తాను ఫిర్యాదు చేసిన అంశం పట్ల విచారణ జరిగితే బాగుంటుందని ఆమె అన్నారు. తాను ప్రభుత్వ సెలవుపై వెళ్లాను అని, మళ్లీ విధుల్లో చేరగానే ఇదంతా చూసినట్లు డీఐజీ రూప తెలిపారు. ఏదైనా చూసి రిపోర్ట్ ఇవ్వకుంటే తాను తప్పు చేసినట్లుగా భావిస్తాను అని, శశికళకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలపై కేవలం నివేదిక మాత్రం ఇచ్చాను అని ఆమె అన్నారు. తాను ఇచ్చిన రిపోర్ట్‌పై ప్రభుత్వం నిజనిర్ధారణ దర్యాప్తు చేపట్టాలని డీఐజీ రూప డిమాండ్ చేశారు.


