హిందూజాకి రూ.2464 కోట్లు ధారాదత్తం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- 10 Views
- admin
- July 14, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : రాష్ట్ర ప్రభుత్వం హిందూజా విద్యుత్ కంపెనీకి అదనంగా రూ.2464 కోట్ల మేరకు చెల్లింపులు జరపాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈమేరకు అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూజా కంపెనీతో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా అదనపు చెల్లింపులు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో ఉందని చెబుతున్న ప్రభుత్వం, హిందూజా కంపెనీ విషయంలో ఎందుకు దుబారా ఖర్చులకు నిర్ణయించారని ఆయన ప్రశ్నించారు. చెల్లింపులు ఆపని పక్షంలో రాష్ట్రంలో ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో లంచగొండి పాలన నడుస్తోందని ఆరోపించారు. గత నెలలో ఏసిబికి చిక్కిన ఇంజనీరింగ్ ఛీఫ్ పాండురంగారావు వద్ద కనివినీ ఎరుగని రీతిలో రూ.800కోట్ల మేరకు అవినీతి సంపాదన బయటపడటం ప్రజలను విస్మయపరిచిందని గుర్తు చేశారు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. భూ ఆక్రమణలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును వెంటనే మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని సస్పెండ్ చేయకుండా సిట్ విచారణ అనడం భూటకమన్నారు. సిట్ విచారణతో బాధితులకు న్యాయం జరగదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి(నాని), పార్టీ నాయకులు స్టాలిన్, మార్కండేయులు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


