గుడ్డుతో వెరైటీగా..
- 24 Views
- admin
- July 16, 2017
- Home Slider తాజా వార్తలు వంటిల్లు
గుడ్డుతోనూ అవియల్ కూర!
గుడ్డులోని పోషకాల సంగతి మనకు తెలియంది కాదు. అదేసమయంలో దాంతో చేసుకోగలిగే వెరైటీ రుచులకూ కొదవ లేదు. వాటిల్లో కొన్ని…
ముత్తా అవియల్
కావలసినవి
ఉడికించిన గుడ్లు: 4, బంగాళాదుంపలు: రెండు, చింతపండు గుజ్జు: 4 టేబుల్‌స్పూన్లు లేదా టొమాటోగుజ్జు: కప్పు, కొబ్బరితురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లిరెబ్బలు: రెండు, పసుపు: పావు టీస్పూను, కారం: టీస్పూను, ఆవాలు: ముప్పావుటీస్పూను, జీలకర్ర: టీస్పూను, మినప్పప్పు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* బంగాళాదుంపల్ని పొట్టు తీసి ముక్కలుగా కోయాలి.
* ఓ బాణలిలో కొబ్బరి తురుము, వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించి తీసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి.
* నాన్‌స్టిక్ పాన్‌లో రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి కాగాక, బంగాళా దుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరవాత మసాలా ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు చింతపండు లేదా టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి కలిపి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. తరవాత ఉడికించిన కోడిగుడ్లను సగానికి కోసి కూర మిశ్రమంలో వేసి కదపకుండా మూత పెట్టి సిమ్‌లో సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.
* విడిగా ఓ చిన్న పాన్‌లో టేబుల్‌స్పూను నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు చేసి కూరలో కలిపి వడ్డిస్తే కేరళ ముత్తా అవియల్ కూర రెడీ.
చీజ్ ఆమ్లెట్
కావలసినవి
కోడిగుడ్లు: రెండు, ఉల్లిముక్కలు: పావుకప్పు, క్యాప్సికమ్ ముక్కలు: పావుకప్పు, ఉప్పు: కొద్దిగా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టీస్పూన్లు, చీజ్: సుమారు పావుకప్పు(రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు), కారం: పావుటీస్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: పావుటీస్పూను, పుదీనా, సోయకూర తురుము: కొద్దికొద్దిగా(ఇష్టమైతేనే)
తయారుచేసే విధానం
* ఓ చిన్న గిన్నెలో గుడ్లసొన వేసి బాగా గిలకొట్టాలి.
* నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తరవాత గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, పుదీనా, సోయకూర తురుము అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో వేసి కలపాలి. ఇప్పుడు మరో టీస్పూను నూనె పాన్‌లో వేసి మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి.
మసాలా ఎగ్ పరాటా
కావలసినవి
ఉడికించిన కోడిగుడ్లు: నాలుగు, మిరియాలపొడి: టీస్పూను, కొత్తిమీర తురుము: అరకప్పు, గోధుమపిండి: పావుకిలో, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లను సన్నగా తురిమినట్లుగా కోయాలి. అందులోనే మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి.
* ఓ గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చపాతీలా వత్తాలి. తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
గుడ్డు బిర్యానీ
కావలసినవి
బాస్మతిబియ్యం: అరకిలో, కోడిగుడ్లు: ఎనిమిది, వెన్న: 6 టీస్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయలు: రెండు, కొత్తిమీర తురుము: టీస్పూను, గరంమసాలా: టీస్పూను, పెరుగు: 2 కప్పులు, పుదీనా: కట్ట, జీలకర్ర: టీస్పూను, బిర్యానీ మసాలా: టీస్పూను, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* ఓ చిన్న బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక కాసిని ఉల్లిముక్కల్ని బాగా వేయించి తీయాలి.
* బియ్యం కడిగి కనీసం గంటసేపు నాననివ్వాలి.
* ఉడికించిన గుడ్లను పొడవాటి ముక్కలుగా కోయాలి. కోసేటప్పుడు అందులోని పచ్చసొన విడిపోకుండా చూడాలి. ఓ చిన్న బాణలిలో 3 టీస్పూన్ల వెన్న వేసి కరిగిన తరవాత గుడ్డు ముక్కల్ని వేయాలి. వాటిమీద కాస్త ఉప్పు, కారం, సెనగపిండి చల్లినట్లుగా వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి.
* ప్రెషర్ కుక్కర్ లేదా పాన్‌లో మిగిలిన వెన్న, నూనె వేసి కాగాక గరంమసాలా, వేయించిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, బిర్యానీ మసాలా వేసి వేయించాలి. తరవాత పెరుగు వేసి కలిపి ఓ నిమిషం ఉడికించాలి. ఇప్పుడు ముప్పావులీటరు నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. బియ్యం ముప్పావువంతు ఉడికిన తరవాత సిమ్‌లో పెట్టి పూర్తిగా ఉడికిన తరవాత వేయించిన గుడ్లను వేసి కలిపి వడ్డించాలి.


