విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు సముద్రస్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకు పోయి మృతిచెందారు. పీఎం పాలెం సీఐ కె.లక్షణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు విశాఖపట్నంలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఐదుగురు ఈరోజు ఉదయం సముద్ర స్నానం చేసేందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. నలుగురు సముద్రం లోపలికి వెళ్లగా వీరిలో రాహుల్(33), నోవల్(33)లు అలల దాటికి గల్లంతై వూపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు యువకులను స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.