ఈ నాచురల్ టిప్స్ పాటిస్తే.. దోమలు పరార్
- 28 Views
- admin
- July 18, 2017
- తాజా వార్తలు వంటిల్లు
వర్షాకాలం వచ్చి చాలా రోజులవుతుంది. ఈ పాటికి దోమల సంఖ్య కూడా పెరిగే ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా దోమలు మనల్ని కుట్టి విష జ్వరాలను వ్యాప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటి నుంచి రక్షణగా ఉండకపోతే ఎలా..?
దోమల బెడద నుంచి మనల్ని మనం కాపాడుకోకపోతే ఆ తరువాత వచ్చే వ్యాధులు నయం అయ్యేందుకు వేలకు వేల రూపాయలను హాస్పిటల్స్‌లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ బాధంతా లేకుండా పలు సింపుల్ టిప్స్‌తో దోమలను ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుదీనా ఆయిల్ మిశ్రమం: అర కప్పు పుదీనా ఆయిల్, అర కప్పు వెజిటబుల్ ఆయిల్, అర కప్పు వెనిగర్‌లను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి గదుల్లో స్ప్రే చేయాలి. దీంతో 2 గంటల్లోనే దోమలు పారిపోతాయి. రోజూ ఈ మిశ్రమాన్ని రాత్రి పూట స్ప్రే చేసుకుంటే దోమలు కుట్టకుండా జాగ్రత్త వహించవచ్చు. మస్కిటో కాయిల్స్, రీపెల్లెంట్స్ కన్నా చాలా మెరుగ్గా ఈ మిశ్రమం పనిచేస్తుంది.
2. వేప, కొబ్బరి నూనెలు: వేప నూనె, కొబ్బరి నూనెలను సమ భాగాల్లో తీసుకుని శరీరంపై రుద్దుకోవాలి. దీంతో ఆయా భాగాల్లో దోమలు కుట్టవు. దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
3. లెమన్ గ్రాస్: లెమన్ గ్రాస్‌ను నిమ్మగడ్డి అంటారు. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ గ్రాస్‌ను మిశ్రమంగా చేసి దాన్నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని ఒక కప్పు వేడి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోయాలి. అనంతరం దాన్ని స్ప్రే చేయాలి. దీంతో దోమలు పారిపోతాయి. అయితే లెమన్ గ్రాస్‌కు బదులుగా లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా దొరుకుతుంది. దాన్ని కూడా ట్రై చేయవచ్చు.
4. తులసి: తాజాగా ఉన్న తులసి ఆకులను నలిపి ఒక పలుచని మస్లిన్ వస్త్రంలో చుట్టి గదుల్లో వేలాడదీయాలి. లేదా తులసి ఆకుల రసాన్ని శరీరానికి రాసుకున్నా చాలు, దోమల నుంచి రక్షణ లభిస్తుంది. తులసి ఆకుల వల్ల దోమలే కాదు, ఈగలు కూడా పారిపోతాయి. తులసి ఆకులు దొరక్కపోతే తమలపాకులు, పుదీనా ఆకులు కూడా ఉపయోగించవచ్చు. ఇవి కూడా దోమలను తరమడంలో బాగా పనికొస్తాయి.
5. వెల్లుల్లి: నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వాటిని దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను నీటిలో వేసి బాగా ఉడికించాలి. అనంతరం నీరు చల్లారాక వడకట్టాలి. తద్వారా వచ్చే మిశ్రమాన్ని బాటిల్లో పోసి స్ప్రే చేసుకోవాలి. దీంతో దోమలు పారిపోతాయి.
6. కర్పూరం: ఒక కప్పు వేప నూనె తీసుకుని అందులో కొంత కర్పూరాన్ని దంచి పొడి చేసి వేయాలి.
ఈ మిశ్రమాన్ని దోమల రీపెల్లెంట్లో పోయాలి. అనంతరం రీపెల్లెంట్‌ను ప్లగ్‌లో పెట్టాలి. దీంతో రీపెల్లెంట్ నుంచి వచ్చే వాయువులకు దోమలు ఉండవు. అయితే రీపెల్లెంట్లో కాకుండా స్ప్రే బాటిల్లో కూడా దీన్ని పోసుకుని వాడవచ్చు.


