అమరావతి: రాబోయే ఏడాది అత్యంత కీలకమని, ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలే తిప్పికొట్టేలా ప్రజాప్రతినిధులంతా మమేకమై ముందుకుసాగాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం అమరావతిలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని గుర్తుచేశారు. అనుకున్న లక్ష్యాలన్నీ ఏడాదిలోపు పూర్తిచేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇంటింటికీ తెదేపా కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని సూచించారు. అధికారంలో ఉన్నామనే స్పృహతో నేతల్లో ఎల్లవేళలా ఉండాలన్నారు. భేషజాలు వదులుకొని బృంద స్ఫూర్తితో పనిచేసి ప్రజాదరణను పొందాలన్నారు. ఏడు ప్రాజెక్టులు దాటి కృష్ణా ఆయకట్టుకు సాగునీరు రావాలన్న చంద్రబాబు తొలిసారి జులైలోనే కృష్ణా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చామన్నారు. పట్టిసీమ నిర్మాణం ద్వారానే ఇది సాధ్యమైందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు.