ముగిసిన శ్యామ్ కె.నాయుడి సిట్ విచారణ
- 8 Views
- admin
- July 20, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న మాదకద్రవ్యాల వ్యవహారంపై విచారణలో భాగంగా రెండో రోజు కెమెరామెన్ శ్యాం.కె.నాయుడితో సిట్ అధికారుల విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. డ్రగ్స్ వ్యవహారంపై కెల్విన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆబ్కారీ శాఖ అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో నిన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సుదీర్ఘంగా విచారించగా.. ఈ రోజు శ్యామ్ కె.నాయుడును విచారణకు పిలిచారు. ఈ ఉదయం తన న్యాయవాది, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. దీంతో సిట్ అధికారుల బృందం ఈ ఉదయం 10.30 గంటల నుంచి పలు దఫాలుగా విచారించారు. డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ఆరా తీసినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4గంటల వరకు విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. కెల్విన్ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కొద్దిసేపటి క్రితమే శ్యామ్ కె.నాయుడు సిట్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. కెల్విన్‌తో ఇతరులకు ఉన్న సంబంధాలపై ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.


