అధికార దర్పం, స్వప్రయోజనాలే నేటి రాజకీయాలు
- 30 Views
- admin
- July 21, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
అధినాయకుడ్ని నమ్మి.. ప్రజాపక్షాన ఉండేవాళ్లం
స్థానిక సంస్థలు బలోపేతంతోనే అభివృద్ధి సాధ్యం
కార్మికుల భవిష్యత్తు ట్రేడ్ యూనియన్లు
నా రాజకీయ గురువు ఎన్టీఆర్
ఫీచర్స్ ఇండియాతో మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ డా||రాజాన రమణి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: అందరిలా పుట్టిపెరిగి జీవితం సాగిపోయింది అనుకోవడం కంటే వ్యక్తిగా కాక ఓ ఆశయంతో శక్తిగా పదిమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని చరిత్ర పుటల్లో నిలవానేది కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే జీవితములో ఏదో సాధించాలనే తపన పట్టుదల, సహనం, కష్టపడే గుణం, నల్గురిని కలుపుతూ వెళ్లేనైజం, దీనికి తగ్గట్టుగా కుటుంబం మద్ధతు ఉండాలి. వ్యక్తిగా ఎదిగేందుకు తగిన అర్హతలైన ప్రేమ, అభిమానం ఎదుటివారిని గౌరవించే స్వభావం, నూతన పోకడలతో మారుతున్న సమాజాన్ని అర్ధం చేసుకోవడం, తన చుట్టూ వున్న ప్రజలకు తనకు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చేలా అందరూ ఆనందంగా జీవించాలని తపనతో విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ డా|| రాజాన రమణిపై ఫీచర్స్ ఇండియా ప్రత్యేక కథనం..
జీవితంలో వచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ కుటుంబ ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పొంది, కళాశాల లెక్చరర్‌గా జీవితం ప్రారంభించిన నేను విశాఖ ఎమ్మెల్యేగా, ప్రధమ మేయర్‌గా దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రజలు చూపించిన ఆదరాభిమానాలతో ఎలాంటి సదుపాయాల్లేని రోజుల్లో విశాఖ నగర అభివృద్ధి కోసం తన వంతు కృషి అందించానని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రధమ మేయర్ రాజాన రమణి ఫీచర్స్ ఇండియా ముఖాముఖిలో తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణను రోటరీ సంస్థ ప్రోత్సాహంతో పొందినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీఆర్ విద్యావంతులకు పిలుపునిచ్చిన సమయంలో అందరిలాగే తాను దరఖాస్తు చేసుకున్నానని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు అవకాశమిచ్చి ఎన్టీఆర్ చరిష్మాతో ఎమ్మెల్యేగా గెలవడం, మొదటిగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం ఎంతో భావోద్వేగానికి లోనయ్యానన్నారు. విద్యార్ధి దశ నుంచి నాయకత్వానికి ముందడుగు వేసి సమస్యల సాధనకు పనిచేసినట్లు తెలిపారు. తేదేపా అభ్యర్ధిగా ఎన్నికల్లోని ప్రచారములో అన్న స్వర్గీయ ఎన్టీఆర్ మీ ఇంటి ఆడపడుచును గెల్పించుకోండని అనే మాటలు మర్చిపోలేనన్నారు. అప్పట్లో నాయకుడే సర్వస్వంగా భావించి మనస్ఫూర్తిగా నమ్మనడేచి ప్రజా సేవకు అంకితమయ్యే వాళ్లమన్నారు. నేటి రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారిపోవడం భాధాకరమన్నారు. వ్యక్తిగతం, ప్రేమ, ఆప్యాయతలు కరువైపోయాయన్నారు. డబ్బుంటే చాలని నేడు రాజకీయాలు నడుస్తాయన్నారు. అయితే ఓటరుని ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తే గుణపాఠం చెబుతారన్నారు.
గృహ హింస చట్టాన్ని అప్పట్లో ఆమోదింపజేశామన్నారు. తదుపరి టిడిపిలో ఎన్టీఆర్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని దగ్గర ఉండి చూసిన సందర్భాలున్నాయన్నారు. అయితే తేదేపా నిలబెట్టాలనే తాపత్రయంలో నేటి ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు చేసిన ప్రయత్నాలు మర్చిపోలేమన్నారు. దీనంతటికీ ఎవరు కారణమనేది ప్రజలకు తెలుసన్నారు. అది ఒక దురదృష్టకరమైన సంఘటనగా తెలిపారు. 1989లో జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, వైఎస్ఆర్ పిలుపుతో పార్టీ మారి కాంగ్రెస్ హయాంలో విశాఖ ప్రధమ మేయర్‌గా బాధ్యతలు పొంది విశాఖనగరాభివృద్ధికి కృషి చేసినట్లు రాజాన రమణి వెల్లడించారు. అన్న ఎన్టీఆర్‌ను సంక్షోభ సమయంలో కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేసానని, అయితే లక్ష్మీపార్వతి హవా నడుస్తుండటం వల్ల కలవలేకపోయానన్నారు. ఈ పరిణామాలు మానసిక వేధనకు దారి తీశాయన్నారు. రాజశేఖర్‌రెడ్డి తత్వం వేరని, అన్న ఎన్టీఆర్ ఛరిష్మా వేరన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హాయాంలో కాంగ్రెస్‌లోకి వచ్చి కొంతకాలం తర్వాత నేటి తేదేపాలో కొనసాగుతున్నట్లు తెలిపారు.
నేడున్నవి కలుషిత, కుతంత్ర రాజకీయాలని, స్వప్రయోజనాలు రాజ్యమేలుతున్నాయన్నారు. అవకాశవాదులు అందలమొక్కుతున్నారని ప్రజాబలం కొంతైనా కానరావడం లేదన్నారు. అప్పట్లో ప్రజా భాగస్వమ్యంతో జన చైతన్యం, సౌకర్యం, ఆరోగ్య విశాఖ, గ్రీన్ విశాఖ, భూగర్భ కాలువలు, కొళాయిలు వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. హైదరాబాద్ గ్రేటర్ మేయర్ తీగల కృష్ణారెడ్డితో అప్పటి సీఎం చంద్రబాబు, రాజాన రమణి చేస్తున్న అభివృద్ధిని పరిశీలించమని చెప్పడం చాలా ఆనందంగా ఉండేదన్నారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసి నిజమైన అభివృద్ధిని చూడాలని రమణి సూచించారు. ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మిక సమస్యలపై తిరుగులేని పొరాటాలు చేసి కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 16వేల కార్మికులతో కలిసి సమస్యలపై పోరాడామన్నారు.
ప్రజా సమస్యలపై పనిచేసిన తనకు నేటికీ ప్రజాభిమానం తనపై ఉందన్నారు. విభజన అనంతరం రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పడటం భాధాకరమణ,ఇ మనదనుకునే హైదరాబాద్ పరాయిది కావడం విచారంగా ఉందన్నారు. తేదేపాలో ప్రస్తుతం కొనసాగుతున్నానని అయితే ఎమ్మెల్యేగా, మేయర్‌గా, ప్రజా కార్యక్రమాలు, సేవల్లో పనిచేసిన తనకు లాబీయింగ్ చేయడం తెలీదన్నారు. విశాఖ టిడిపి పదవుల్లో వున్న నాయకులు నన్ను విస్మరిస్తున్నారని ఇది ఆవేదనకు దారి తీస్తుందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నాయకత్వములో అసెంబ్లీ లెజిస్లేటివ్ సెక్రటరీగా పనిచేశానని అప్పటి గౌరవాలు, అభిమానాలు, ఆప్యాయతలు టిడిపిలో కనిపించడం లేదని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన పలువురు సీనియర్లు ఎంతగానో మదనపడుతున్నారని ఇది బాధాకరమైన పరిణామం అన్నారు. సహజంగా ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తిగా అందరి అభిమానంతో ఆనందంగా ఉన్నానన్నారు. తనకు వెన్నుదన్నుగా భర్త నరేంద్ర ఉండి, జీవిత సమరం కొనసాగిస్తున్నట్లు రాజాన రమణి స్పష్టం చేశారు.


