కుప్పం: పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేలా ప్రోత్సహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అంగన్వాడీలను ప్రక్షాళన చేస్తామని.. కాన్వెంట్ పాఠశాలల మాదిరిగా కుప్పంలో అంగన్వాడీలను రూపొందిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పంలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్, టౌన్ బ్యాంకు భవనాలను ప్రారంభించారు. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించి లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగుల కోసమే నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పేదల ఆదాయం పెంచేందుకు ఉపాధి హామీ కూలిని రూ.193గా చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో బీటీ, సిమెంట్ రహదారులు పూర్తి చేశామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య తలెత్తితే 1100 నెంబరుకు డయిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరికీ ఎలాంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే తనకు ఫిర్యాదు చేస్తే వారి సంగత తాను చూసుకుంటానని ప్రజల కరతాళ ధ్వనుల మధ్య స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాల్నదే తన లక్ష్యమని.. గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రాయితీ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో రూ.4.5 వేల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు.