
వరుణ్(వరుణ్‌తేజ్) అమెరికాలో మెడిసిన్ చదువుతుంటాడు. పెద్ద డాక్టర్‌గా పేరు తెచ్చుకొని ఆ దేశంలోనే స్థిరపడాలన్నది అతడి ఆశ. అన్నయ్య, తమ్ముడిలతో కలిసి అమెరికాలో జీవిస్తుంటాడు. భానుమతి(సాయిపల్లవి) స్వతంత్య్ర భావాలు గల అమ్మాయి. తండ్రి, తన ఊరితో పాటు వ్యవసాయం అంటే ఆమెకు చాలా ఇష్టం. తన ప్రాంతాన్ని, తన వాళ్లను ఎవరైన కించపరిస్తే అస్సలు సహించదు. తనను ప్రాణంగా ప్రేమించే మనుషుల మధ్యే జీవితాంతం ఉండిపోవాలని ఆశపడుతుంది. వరుణ్ అన్నయ్యకు, భానుమతి అక్కతో పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లి కోసం తెలంగాణలోని బాన్సువాడలోకి అడుగుపెడతాడు వరుణ్. ఆ వేడుకలో వరుణ్, భానుమతిల మధ్య ఏర్పడిన పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వెల్లడించాలనుకునే లోపే అపోహలు, అభిప్రాయభేదాల కారణంగా ఇద్దరు విడిపోతారు. మనసులో ఇష్టం ఉన్నా దానిని వ్యక్తపరచలేక అనుక్షణం సంఘర్షణకు లోనవుతుంటారు. చివరకు వారిద్దరు ఏలా ఏకమయ్యారు? తను ఇష్టపడ్డా భానుమతి కోసం వరుణ్ ఏలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? వారి మధ్య అపోహలు ఎలా తొలగిపోయాయి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఓ ప్రాంతానికి చెందిన సంస్కృతుల్ని సంప్రదాయాలను వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా జోడించి వెండితెరపై ఆవిష్కరించడం కత్తిమీదసాము లాంటిది. కానీ ఈ విషయంలో దర్శకుడు శేఖర్‌కమ్ముల సఫలమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, కల్మషం లేని ఇక్కడి మనస్తత్వాల్ని ఫిదా సినిమాలో సహజంగా చూపించారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనురాగాన్ని, పెళ్లి తర్వాత కుటుంబానికి దూరమైపోతానని భయపడే సగటు అమ్మాయిలా మనోభావాలను మనసుల్ని కదలించేలా సినిమాలో తెరకెక్కించారు. కథను కాకుండా కేవలం పాత్రల మధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా తనదైన శైలిలో ఈ సినిమాను నడిపించారు. మలుపులు, హీరోయిజం, భారీపోరాటాలు లాంటివేవీ లేకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తెలంగాణ యాసలో సాగే సంభాషణలు సినిమాకు అందాన్ని ఆపాదించాయి. తెలంగాణ సంస్కృతులు, సంప్రదాయాలను చాలా లోతుగా, సహజంగా సినిమాలో చూపించారు. ఇందుకోసం ఆయన చేసిన పరిశోధన ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.
పెళ్లి జరిగే తీరును, తాటాకు పందిళ్లు, బియ్యం పోలు పోయడం లాంటి అంశాలను సంప్రదాయబద్దంగా ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. పచ్చదనంతో నిండిన తెలంగాణ పల్లెవాతావరణం ఈ కథకు ప్రాణం పోసింది. బతుకమ్మ పండుగను, పంటపొలాలు, చేదబావులు, పాతకాలం నాటి పెంకుటిళ్లను కోనసీమకు ధీటుగా చాలా అందంగా సినిమాలో చూపించారు. హ్యాపీడేస్, ఆనంద్ తర్వాత చాలా కాలం తర్వాత మరోసారి ఈ సినిమాతో తన ప్రతిభను చాటుకున్నారు శేఖర్‌కమ్ముల. కేవలం దర్శకుడిగానే కాకుండా తెలంగాణ మార్కు సంభాషణలతో అందరిని అలరించారు. సగటు తెలంగాణ పల్లెలో వినిపించే పదాలతో సాగే సంభాషణలు ఆహ్లాదాన్ని పంచుతాయి.
కథకు తగినట్లుగా నటీనటులు ఎంపిక చక్కగా కుదిరింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవిలా జంట తెరపై చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి తన నటనతో భానుమతి పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. నిజమైన తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా చక్కటి హావభావాలను ప్రదర్శించింది. నటనతో పాటు డ్యాన్సుల్లో ప్రతిభను చాటింది. తన పాత్రకు తానే తెలంగాణ మాండలికంలో ఎలాంటి తడబాటు లేకుండా డబ్బింగ్ చెప్పుకున్నది.
తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి పాత్రను బలంగా వెండితెరపై ఆవిష్కరించారు శేఖర్‌కమ్ముల. వరుణ్‌తేజ్ పాత్ర హుందాగా, భావోద్వేగ ప్రధానంగా సాగుతుంది. తన పాత్రలో ఇమిడిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. తెలంగాణ నేటివిటీకి తగినట్లుగా ఇక్కడి నటీనటుల ఎంచుకోవడం కథను రక్తికట్టించింది. సాయిపల్లవి తండ్రిగా మా భూమి ఫేమ్ సాయిచంద్ అద్వితీయ నటనను ప్రదర్శించారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్ ఓ కీలక పాత్రలో నటించారు. నాయకానాయికల తర్వాత వీరి పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరుణ్ అన్నయ్యగా గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు రాజా సహజ నటనను ప్రదర్శించారు. సాయిపల్లవి అక్కయ్యగా వ్యాఖ్యాత శరణ్య తెలంగాణ మాండలికంలో చెప్పే డైలాగ్‌లు చక్కటి అనుభూతిని పంచుతాయి. కథలో అనవసరపు పాత్రలు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌లు కనిపించవు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.
శక్తికాంత్ బాణీలు వీనుల విందుగా సాగాయి. ప్రతి పాట అర్థవంతంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంతో సాగే వచ్చిందే, హే పిల్లగాడ పాటలు కొత్తగా ఉన్నాయి. వాటిని చిత్రీకరించిన తీరు బాగుంది. జీవన్‌బాబు నేపథ్య సంగీతం బాగుంది. తెలంగాణ అందాలను సహజంగా, కనులవిందుగా చూపించారు ఛాయాగ్రహకుడు విజయ్.సి.కుమార్. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుంది. కథను, శేఖర్‌కమ్ముల ఆలోచనలను నమ్మి నిజాయితీగా ఈ సినిమాను నిర్మించారు దిల్‌రాజు. సినిమా బాగా రావడానికి ఆయన పడిన తపన ప్రతి సన్నివేశంలో కనిపించింది. తన అభిరుచులకు అనుగుణంగా భారీ వ్యయంతో నిర్మించారు.
తెలంగాణ నేపథ్యంలో కమర్షియల్ సినిమాల్ని జనరంజకంగా తీర్చిదిద్దవచ్చని..ఫిదా నిరూపించింది. సినిమా చిత్రీకరణలకు ఆంధ్రా ప్రాంతాలకు తెలంగాణ ఏ మాత్రం తీసిపోదని చాటిచెప్పింది.