జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం
- 21 Views
- admin
- July 24, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
భోగాపురం, ఫీచర్స్ ఇండియా
జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హైవే సర్వే కూడా పూర్తయ్యింది. మూడు, నాలుగు వారాల్లో సరిహద్దు గుర్తింపు చేపడతారు. ఇప్పటికే ఆక్రమణలో ఉన్న హైవే స్థలాలను గుర్తించి ఖాళీ చేయాలని అధికారులు వారికి ముందస్తు సమాచారం అందజేశారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు నాలుగు లైన్లుగా ఉన్న ఈ రోడ్డును ఆరు వరుసలుగా అభివద్ధి చేయాలని హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సర్వేలు కూడా వేగవంతంగా పూర్తి చేశారు. గతంలో ఈ పనులను ట్రాన్స్పోర్టు డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు మధ్య డివైడర్ నుంచి రెండు వైపులా 60 మీటర్ల వరకు విస్తరించనున్నారు. 2002లో రహదారి నిర్మాణం చేసేటప్పుడు అంతవరకు భూమి సేకరించారని తెలుస్తోంది. ఈ స్థలానికి ఇప్పటికే సరిహద్దులు కూడా గుర్తించి రాళ్లు ఏర్పాటు చేశారు. సర్వీసు రహదారి ఉన్న చోటు కూడా ఆరు లైన్లు నిర్మిస్తారు. ఇంకా అదనంగా స్థలం కావాల్సిన చోట భూసేకరణకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న అన్ని వంతెనలను ఆరు వరుసలకు అనుగుణంగా విస్తరిస్తారు. భవిష్యత్ అవసరాల దష్ట్యా విమానాశ్రయానికి వెళ్లే మార్గం వద్ద ఇంటర్ చేంజింగ్, రింగ్ మాదిరిగా రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆనందపురం నుంచి రణస్థలం వరకు 47 కిలోమీటర్ల మేర ముందుగా రహదారి నిర్మిస్తారు. తర్వాత నరసన్నపేట వరకు రెండోవిడతలో మరో 56 కిలోమీటర్లు విస్తరిస్తారు. మూడోవిడతలో ఇచ్ఛాపురం వరకు పనులు చేపడతారు. తొలివిడతలో తగరపువలస వద్ద గోస్తనీ, నాతవలస వద్ద చంపావతి, కందివలస వద్ద నాగావళి నదులపై పెద్ద వంతెనలు కడతారు. రణస్థలం మండలం పతివాడపాలెం, నెలివాడ, పూసపాటిరేగ మండలం కందివలస, కనిమెట్ట, అగ్రహారం, చింతపల్లి జంక్షన్, పూసపాటిరేగ, కోనాడ, భోగాపురం మండలంలో సుందరపేట, చాకివలస, సవరవల్లి, పోలిపల్లి, అవంతి కళాశాల సమీపంలో వీటిని నిర్మించ నున్నారు. ఇవికాక మరో ఎనిమిది మధ్యస్థ వంతెనలు, 13 లైట్ వెయిట్ అండర్ ప్రాసేజ్ బ్రిడ్జిలు కడతారు. కల్వర్టులున్న చోట నిర్మాణాలు చేపడుతూ ప్రవాహాలు ఎక్కువ ఉన్న చోట అదనంగా కల్వర్టుల నిర్మాణాలు వస్తాయి. ఇప్పటికే జాతీయ రహదారిపై గుర్తించిన పాయింట్ల వద్ద ఒక్కోచోట 25 అంశాలతో పరిశీలించి దానిపై సమగ్ర సర్వే చేశారు. అలాగే బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం కోసం మట్టి నమూనాలను సైతం పరిశీలన పూర్తయ్యింది. అగనంపూడి టోల్ ప్లాజా నుండి ఇచ్చాపురం వరకూ సర్వే పూర్తి చేశారు. టోల్ ప్లాజాలు వద్ద అదనంగా భూసేకరణ ఉంటుంది. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తరణ జరుగుతోంది. అనంతరం రహదారిని అనుకొని ఉన్న నిర్మాణాలను తొలగించనున్నారు. రహదారుల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఏమైనా అనుసంధాన రహదారులు అవసరమైతే వాటి డెమోగ్రఫీ పరిశీలించి ఏర్పాటు చేస్తారు.