నేడు కార్గిల్ విజయ దివస్
- 20 Views
- admin
- July 25, 2017
- జాతీయం తాజా వార్తలు
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య 1999 మే నుంచి జూలై వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లా సహా మరికొన్ని సరిహద్దుల వద్ద సంభవించింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి (వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న పేర్కొంది. వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకు ఇదే పెద్ద ఉదాహరణ. అంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది. మొదటిది చైనా – సోవియట్ మధ్య 1969లో జరిగింది.
భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లధాక్ ప్రాంతంలోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. 1947…48 మధ్య జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధం తర్వాత వాస్తవాధీన రేఖ బల్టిస్తాన్ జిల్లా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్లో భాగమైంది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.
కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -48 డిగ్రీలుగా ఉంటుంది. శ్రీనగర్ – లేహ్‌ను కలిపే జాతీయ రహదారి కార్గిల్ మీదుగా వెళ్తుంది. ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 పొడవునా కొండలపై నుంచి కాల్పులు జరిపారు. కొండల మీదున్న సైనిక స్ధావరాలు 16,000 అడుగుల ఎత్తులో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో) ఉన్నాయి. కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించడం. అంతేకాక ఎత్తైన ప్రదేశం ఆక్రమించుకోవడం వల్ల కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరో అడ్డంకి.
1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా శియాచిన్ హిమానీనదము మీద పట్టు సాధించటానికి చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి. 1990లలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పటువాదం, అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
1998 -1999 మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ల రూపంలో కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి ”ఆపరేషన్ బద్ర్” అని గుప్త నామం. దీని లక్షం కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని శియాచిన్ నుండి వెనక్కి పంపడం. అంతేకాదు భారత్‌ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్య అంశం అవ్వాలని పాక్ ఉద్దేశం. పాకిస్తాన్ కుయుక్తులను భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్‌తో గట్టిగా జవాబిచ్చింది.


