మీ-సేవలు అంతంతమాత్రమే
- 23 Views
- admin
- July 25, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
అరకొరగా కౌంటర్లు
కేంద్రాల్లో వసతులు లేక ప్రజలకు తప్పని ఇబ్బందులు
ఇతర కేంద్రాలకు తరలుతున్న వినియోగదారులు
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా : వివిధ పనుల కోసం మీసేవా కేంద్రాలకు వస్తున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రభుత్వం సుమారు 300లకు పైగా సేవలను మీసేవా కేంద్రాల ద్వారా సేవలను అందిస్తోంది. అవసరాల నిమిత్తం ప్రతీరోజూ పలు సేవల్ని పొందేందుకు ప్రజలు ఖచ్చితంగా మీసేవా కేంద్రాలకు వస్తుంటారు. అయితే మీసేవా కేంద్రాలలో సిబ్బంది, వసతులు లేకపోవడంతో ఒక పనికోసం రోజులు తరబడి వినియోగదారులు తిరగాల్సి వస్తోంది. సేవలు రోజు రోజుకీ పెరుగుతున్నందున సిబ్బందిని, వసతుల్ని పెంచాల్సిన అధికారులు ఉన్న సిబ్బందిని కుదిస్తున్నారు. దీంతో పలు చోట్ల వినియోగదారులకు సక్రమంగా సేవలు అందడం లేదు. గంటలకొద్ది క్యూ లైన్లో వేచి వుండాల్సిన దుస్థితి ఏర్పడింది. తీరాలైన్లో నిల్చున్నా ఒక్కోసారి సర్వర్ ప్రోబ్లమ్స్తో జనం ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. నగరంలో ఉన్న 16 ప్రధాన మీసేవా కేంద్రాలను ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చింది. కేంద్రానికి కావాల్సిన మేనేజర్లు, సిబ్బందిని, సెక్యూరిటి, వసతులన్నీ లీజు తీసుకున్న సంస్థ యాజమాన్యమే ఏర్పాటు చేసుకోవాలి. అయితే అందుకు విరుద్ధంగా సదరు నిర్వహణ సంస్థ వ్యవహరిస్తోంది. చాలీ చాలని సిబ్బందిని పెట్టి తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. కొన్ని రోజులుగా అన్ని మీసేవా కేంద్రాల వద్ద నియమించిన సిబ్బందిని విదుల నుంచి తొలగించేశారు. పెద్ద సంఖ్యలో మీ సేవా కేంద్రాలకు వస్తున్న ప్రజలు గంటలకొద్దీ క్యూ లైన్లో వేచి వున్నప్పటికి పని జరగక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా కంచరపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు విస్తృత సేవలందించిన మీసేవ కేంద్రం, ప్రస్తుతం సిబ్బంది కొరత, పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఈ కేంద్రంలో వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందించలేకపోతోంది. ఈ కేంద్రంలో మేనేజర్‌తో పాటు సరిపడేంతగా సిబ్బంది వుండేవారు. ప్రస్తుతం రెండు కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో వినియోగదారులు సకాలం సేవలు పొందలేకపోతున్నారు. దీనికి తోడు ఇక్కడ తరచూ సర్వర్ మొరాయిస్తుండటం, ఇతర సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మీసేవా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జనం కోరుతున్నారు.